తన, పర అనే వ్యత్యాసాలు ఉండకూడదు.. అందరం ఒక కుటుంబమే. ఒకే కుటుంబ సభ్యుల్లాగానే అందరమూ కలిసి మెలిసి జీవించాలి.. ఎప్పుడూ కలహాలు ఉండకూదు. దీనినే వసుధైక కుటుంబం అంటారు. అంత ఆదర్శంగా మనం జీవించాలి.. ఇలాంటి సుద్దులు మనకు చాలా వినిపిస్తుంటాయి. కానీ.. ఇది ఆచరణ సాధ్యమేనా? వసుధైక కుటుంబం అనే మాట కేవలం ఒక మిథ్య మాత్రమేనా?
‘వసుధైక కుటుంబం’ అనే మాట మనకు చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రాంతీయ కుల మత ఇంకా అలాంటి అనేకానేక రకాల కలహాలు పెచ్చరిల్లిన ప్రతిసారీ.. ఎవరో ఒకరు ప్రవచన కారుల అవతారం ఎత్తి.. అందరూ ఒక కుటుంబంలాగా కలిసి మెలిసి ఉండాలనే సందేశాన్ని మానవాళికి ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు.
అయితే ఈ వసుధైక కుటుంబం అనేమాట నిజమేనా? అనేది పెద్ద అబద్ధం. కేవలం అలాంటి ఊహను మాత్రమే మనం ప్రేమిస్తుంటాం. వాస్తవంలో.. ఆ కాన్సెప్టులో జీవించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలదు. ఆ సిద్ధాంతం యొక్క ఆచరణరూపం నిర్దిష్టంగా అసలు ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ.. ఈ ‘వసుధైక కుటుంబం’ అనే మాట మనకు సుభాషితాల్లోనే దొరుకుతుంది.
అయం నిజః పరో వేతి గణనా లఘు చేతసామ్
ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం
‘అతడు నావాడు లేదా అతడు మరొకరి మనిషి.. ఇలాంటి మాటలు, ఇలాంటి పరిగణనలు అన్నీ కూడా సంకుచిత మనస్కులకు మాత్రమేకలుగుతుంటాయి. విశాల హృదయులకు మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం అనిపించుకుంటుంది.’ .. అనేది ఈ శ్లోక భావం.
అందరం ఒకటే కుటుంబం అనే భావన చాలా బాగుంటుంది. తాజా ఉదాహరణను గమనిస్తే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తయ్యాయి. ఒక వర్గం గెలిచింది. ఒక వర్గం ఓడింది. కానీ చిరంజీవి లాంటి పెద్దలు.. గెలుపోటములు ఎలా ఉన్నా.. మా సభ్యులం అందరమూ ఒక కుటుంబమే అని చాలా ఆదర్శంగా ప్రకటించారు. తనయుడి విజయాన్ని ఆస్వాదిస్తున్న మంచు మోహన్ బాబు కూడా.. ఇకమీదట ‘మా’కు ఎన్నికలే ఉండకూడదు అంటూ.. విభేదాలు రాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి ఆదర్శాన్నే సెలవిచ్చారు. అయితే.. ఈ ప్రచారం పేరిట ఇన్నాళ్లూ ఒకరినొకరు తిట్టుకున్న మాటలు అన్నీ ఎక్కడకు పోతాయి.? ఒకరి మీద ఒకరు కక్కిన విషం, ద్వేషం అన్నీ ఎలా మరచిపోగలరు. వాళ్ల వాళ్ల ‘అవసరం’ తీరిన తర్వాత మాత్రమే వసుధైక కుటుంబం అనే కాన్సెప్టు గుర్తుకువస్తుందా? లేకపోతే అది ఎప్పటికీ గుర్తుకు రాదా?
వసుధైక కుటుంబం అనే మాటే నిజమైతే.. కేవలం మనుషుల్ని మాత్రమే కాదు.. పశుపక్ష్యాదుల్ని, సమస్త జీవకోటిని అదే దృష్టితో చూడాలి. ఎప్పుడైతే కేవలం మనుషుల్ని మాత్రమే మనం కుటుంబం కింద పరిగణిస్తూ ఆదర్శాలు చెబుతున్నామో.. ఆటోమేటిగ్గా.. మనలో సంకుచితమైన వర్గదృష్టి మొదలైపోయినట్టే కదా అని వాదించేవారు కొందరుంటారు.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?
కులాలు మతాలు ఇవేవీ లేకపోయినా కూడా.. మనుషుల్ని మన రంగులో ఉన్నవారిని, మన రూపంతో ఉన్నవారిని, మన ప్రాంతానికి చెందిన వారిని.. ‘మన’ వాళ్లుగా పరిగణిస్తూ ఎంచే వ్యత్యాసాలు చాలా సహజంగానే వచ్చేస్తాయి.. అనే వాదన కూడా ఉంటుంది.
స్పష్టంగా చెప్పాలంటే ‘వసుధైక కుటుంబం’ అనే ప్రతిపాదన ఒక మిథ్య.
మరెందుకు మనం ఆ పదాన్ని పట్టుకుని అంతగా వేళ్లాడడం. వసుధైక కుటుంబాన్ని మహా ఆదర్శంగా చెప్పుకుంటూ, ఆచరణసాధ్యంకాని భావనలో బతుకును అన్వేషించుకోవడం అని అందరికీ తప్పకుండా అనిపిస్తుంది.
‘వసుధైక కుటుంబం’ ఒక మిథ్య నిజమే. కానీ మిథ్య కానిది.. ఏది? భగవంతుడు కూడా ఒక మిథ్య. ఉన్నాడో లేడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఉన్నాడు అనే భావనలో మనం బతుకుతూ ఉంటాం. ‘ఉన్నాడు’ అనే భావనలో మనం మన బాధల నుంచి రిలీఫ్ పొందుతూ ఉంటాం. అసలు ఉన్నాడా లేడా అనేది మిథ్య కాగా, ఫలానా చోట ఉన్నాడు అని నిర్దిష్టంగా అనేసుకుని.. అక్కడకు వెళ్లి.. మొక్కి మనల్ని బాధల నుంచి బయటపడేయడం ఇక వాడి డ్యూటీ అని నిమ్మళం అవుతుంటాం.
భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు. కానీ.. కొన్ని కోట్ల మందికి ఒక భరోసాగా, ఒక ఊరటగా, ధైర్యంగా, తోడుగా ‘భగవంతుడు అనే భావన’ ఉన్న మాట వాస్తవం. వసుధైక కుటుంబం కూడా అలాంటిదే. ప్రాక్టికల్ గా సాధ్యం కాని, మిథ్య కావొచ్చు గాక.. కానీ.. ఆ మాటను స్మరించుకోవడంలో తప్పేముంది? మన మన అవసరాలు, అవకాశాలు మనల్ని నడపించిన సందర్భాల్లో.. మనం వర్గాలనే ప్రధానంగా ఎంచుకుంటూ రెచ్చిపోవచ్చు గాక. కానీ.. కనీసం అలాంటి సందర్భాలు ముగిసిపోయిన తర్వాత, అప్పటి ద్వేషాలను, విషాలను మరచిపోవడానికి అయినా.. వసుధైక కుటుంబం అనే మాట, ఆలోచన, మిథ్య.. ఎంతో కొంత ఉపయోగపడితే అంతకంటె కావాల్సింది ఏముంది? అది మిథ్య కావచ్చు.. కానీ ఆ మాట కొంతలో కొంత మన ప్రవర్తనకు ఉపయోగపడుతూ ఉంటుందనేది నిజం. మరి ఆ పదాన్ని కూడా ద్వేషించడం ఎందుకు? దేవుడిని యాక్సెప్ట్ చేసినట్టే.. యాక్సెప్ట్ చేసేద్దాం.!!
శుభోదయం.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post