ఒక వ్యక్తికి గౌరవం దక్కితే.. ఒక సమూహం సంతృప్తి చెందుతుందా? ఆ ఒక్కరికి దక్కిన గౌరవాన్ని తమందరికీ వర్తించే ఆత్మగౌరవంగా భావిస్తుందా? నిర్దిష్టంగా అవునని చెప్పలేం. రాజకీయ పార్టీలు, కుల సమూహాలు ఇలాంటి బూటకపు గౌరవాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఒక వ్యక్తి ఎదగగానే.. తమ కులం మొత్తం ఆ ఘనత సాధించినట్లు టముకు వేసుకునే వారుంటారు. కానీ పార్టీ- కులం చట్రాలలో ఇమడని హిజ్రాల పరిస్థితి అలా కాదు.
తమలో ఒకరికి ఒక అత్యున్నత గౌరవం దక్కితే.. తమందరి జీవితాలు బాగవుతాయనుకునేంత అమాయకత్వం వారికి ఉండదు. ఎందుకంటే.. నిత్యం తెల్లారిన దగ్గరినుంచి వారు ఆ వివక్షలోనే బతుకుతూ ఉంటారు. మంజమ్మకు వచ్చిన పద్మశ్రీ- అందరికీ దక్కిన గౌరవం కాదని వారికి తెలుసు. కానీ.. వారందరి ఆత్మగౌరవాన్నీ నిలబెట్టే పరిణామం మాత్రం మంగళవారం చోటుచేసుకుంది.
హిజ్రాలకు నిజంగా గొప్ప శుభవార్త
హిజ్రాలు కావడం వలన సామాజికంగా వారు ఒక వివక్షకు గురవుతూ ఉంటారు. అనివార్యమైన పరిస్థితుల్లో భిక్ష మెత్తుకోవడం ప్రారంభిస్తారు. ఆత్మాభిమానం విడిచి గాలివాటుగా జీవనం సాగించడం ప్రారంభిస్తారు. అలాంటి వారందరికీ ఇది శుభవార్త.
హిజ్రాలలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఉన్నప్పటికీ.. మెజారిటీ దుస్థితి ఇదే. కొన్ని సందర్భాల్లో హిజ్రాల కారణంగా అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకుంటూ ఉండడానికి కూడా మూలకారణం ఇదే. అయితే ఇలాంటి సామాజిక అసమానతల్ని తుడిచిపెట్టడానికి కర్ణాటక హైకోర్టు ప్రయత్నం చేసింది. హిజ్రాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్పు చెప్పింది.
లైంగిక అల్పసంఖ్యాకుల హక్కుల కోసం పనిచేస్తున్న సంగమ అనే సేవాసంస్థ అక్కడ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేసింది. దానిని విచారించిన జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వకార్పొరేషన్లలో హిజ్రాలకు ఒక శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తాయి.
పోలీసు శాఖ ఒక అడుగు
హైకోర్టు హిజ్రాలకు ఒక శుభవార్త చెబితే.. కన్నడ పోలీసు శాఖ అంతకంటె ముందే మరో శుభవార్తను వినిపించింది. పోలీసు రిక్రూట్ మెంట్ కు ఇచ్చిన ప్రకటనలో స్పెషల్ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
హిజ్రాల ఆత్మగౌరవానికి ఇది మరో మెట్టు
కర్ణాటకలోనే హిజ్రా వర్గానికి చెందిన మంజమ్మ జోగతి ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. జోగతి జానపద నృత్యం విస్తృతికి పాటుపడిన మంజమ్మ జోగతికి పద్మశ్రీ పురస్కారం హిజ్రా వర్గానికి ఒక ఆత్మగౌరవ సూచిక. అయితే.. అది ఒక వ్యక్తికి దక్కిన పురస్కారం మాత్రమే. అదే తాజాగా కర్ణాటక హైకోర్టు ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన తీర్పు.. హిజ్రాల వర్గానికే ఉపయోగపడేది. వారికి మేలుచేసేది. సామాజిక వివక్షను దూరం చేసేది.
.