వాడొక కేటుగాడు! తెల్లకోటు తొడుక్కుని జనాన్ని మోసం చేయడమే వాడి ప్రవృత్తి. అలాగే డాక్టరు వేషంలో ఓ ఆస్పత్రి పెట్టేసి.. యూట్యూబ్ చూస్తే.. ఎడాపెడా అబార్షన్లు చేసేస్తూ చెలరేగిపోతూ ఉంటే.. ఎట్టకేలకు వైద్యశాఖ అధికారులు వాడిని పట్టుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదీ స్టోరీ! అసలు మెడిసిన్‌కు సంబంధించిన ఎలాంటి విద్యార్హతలు లేకుండానే.. ఓ కేటుగాడు.. నగరం నడిబొడ్డులో ఆస్పత్రి పెట్టడం అనేది ఎలా సాధ్యమైంది? అనేది ఇప్పుడు ఎదురౌతున్న మిలియన్ డాలర్ ప్రశ్న.
ఈ వ్యవహారం మొత్తం హన్మకొండలో చోటు చేసుకుంది. అండ్రు ఇంద్రారెడ్డి అనే కేటుగాడు.. బీఎస్సీ చదివి మెడికల్ రెప్రజెంటేటివ్ గా గతంలో పనిచేశాడు. అతడికున్న అనుభవం అంతే. కానీ.. ఆనుపానులు పట్టుకుని డాక్టరు అవతారమెత్తాడు. హన్మకొండ ఏకశిలాపార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరుతో ఓ ఆస్పత్రి తెరిచాడు. రెండోసారి ఆడపిల్ల వద్దనుకునే వాళ్లను గుర్తించి.. వారికి అబార్షన్లు చేయడం ప్రధాన వృత్తిగా పెట్టుకున్నాడు. ఇందుకు కొందరు ట్రెయినింగ్ పొందిన నర్సుల్ని పెట్టుకున్నాడు. వైద్య అధికారులకు విషయం తెలిసి.. దాడిచేస్తే.. ఓ అబార్షన్ చేస్తూ చేస్తూ దొరికిపోయాడు. తీరా ఆరా తీస్తే.. మూడేళ్ల కిందట వరంగల్ జిల్లాలోనే నర్సంపేటలో ఇలాగే ఆస్పత్రి తెరిచి పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఉదంతం లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే.. అంత సులువుగా ఆస్పత్రి తెరవడం ఎలా సాధ్యమవుతోంది? చిన్న కిళ్లీ బంకు పెట్టుకోవాలన్నా అనుమతుల రూపేణా చాంతాండంత ప్రాసెస్ ఉంటుంది. అలాంటిది.. ఒక కేటుగాడు అంత సులువుగా ఆస్పత్రి ఎలా పెట్టేస్తున్నాడు. నగరం నడిబొడ్డులో ఆస్పత్రి తెరిచేసి.. రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంటే.. అది ఎలా సాధ్యమైంది. అధికార యంత్రాంగం ఇన్నాళ్లూ పట్టించుకోలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యం చదవకుండానే.. ఇలా డాక్టరు ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్న వారు ఎందరెందరు ఉన్నారో.. ఊరూరా ఎన్నెన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయో అనే అనుమానం, భయం ప్రజల్లో కలుగుతోంది.
.

Discussion about this post