అతనొక పాతికేళ్ల యువకుడు.పేరు మీరయ్య.
ఎగసిపడే కెరటంలా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే అతను, చిత్తూరుజిల్లా, బంగారుపాళ్యం మండల రిసోర్స్ కేంద్రంలో, భవిత కేంద్రంలో దివ్యాంగులయిన పిల్లలకు IERT టీచర్ గా పని చేస్తున్నాడు.
మీరయ్య ఇప్పుడు నడుస్తున్నాడు. అది నిజంగా ఒక అద్భుతం. ఎంతోమంది సహృదయుల మంచితనం ఫలితంగా సాకారం అయిన అద్భుతం. అందుకే మీరయ్య నడవడం అనేదే ఒక అద్భుతంగా.. ఇవాళ అందరిని అబ్బరపరుస్తోంది. మనుషుల్లో మంచితనం మిగిలుందనే భావనను కలిగిస్తోంది.
కానీ కొన్ని నెలల క్రితం దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకుని , ప్రాణాపాయ స్థితిలో వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేరాడు. బతుకు పైన ఆశలు వదులుకొని నైరాశ్యంలో ఉన్న మీరయ్యను బంగారుపాలెం మండల ఉపాధ్యాయులు ఆదరించారు మేమున్నామంటూ వెన్ను తట్టారు.
సంఘాలకు అతీతంగా అందరూ యధాశక్తి ఆర్థిక చేయూత అందించి, దాదాపు నాలుగు లక్షల రూపాయలు సమకూర్చారు. వేలూరు లో సీఎం సి హాస్పిటల్ కి వెళ్లి MEO నాగేశ్వరరావు, STU రాష్ట్ర నాయకులు గంటా మోహన్ తదితరులు అతనికి సాయం అందజేశారు. జరిగినదానికి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి సన్నద్ధం కావాలని ధైర్యం నూరిపోశారు.
ఇన్ని రోజులు ఆసుపత్రుల్లో గడిపిన మీరయ్య జైపూర్ కృత్రిమ కాళ్లు అమర్చుకున్నారు. యధాతధంగా దివ్యాంగులయిన పిల్లలతో గడపడానికి, విధులకు హాజరు అవుతున్నాడు. ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశానికి.. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు దర్పణం హాజరయ్యాడు.
అతని మొహంలో చిరునవ్వు చూసి అక్కడికి హాజరైన ఎమ్మెల్యే, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు అతన్ని అభినందించారు. బంగారుపాళ్యం మండల ఉపాధ్యాయుల ఉదారత, సేవాతత్పరతను, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్ పూనుకోవడాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

.