తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఊహలోకి రావాలంటే.. నందమూరి తారక రామారావు రూపమే కళ్ల ముందు మెదలుతుంది. ఒక నటుడు ఒక పాత్రకు తానే ప్రతిరూపంగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం అంటే అంత సామాన్యమైన సంగతి కాదు. ఎన్ టి రామారావు తర్వాత.. తెలుగు నటుల్లో అంతటి అరుదైన ఘనత ఉన్నది ఒక్క కైకాల సత్యనారాయణకు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే.. తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు ‘యముడు’ అనగానే.. సత్యనారాయణ రూపమే గుర్తుకు వస్తుంది.
కైకాల సత్యనారాయణ కన్నుమూయడం తెలుగు చిత్ర పరిశ్రమకు లోటు అనడంలో సందేహం లేదు. నిజానికి ఆయన వార్ధక్యం కారణంగా నటనకు,సినిమాలకు దూరమైనప్పుడే ఆ లోటు ఏర్పడింది. కానీ ఆయన ఇప్పుడు కేవలం ఒక స్మృతిగా మిగిలిపోయారు. భువిని వీడి దివికేగారు.
కైకాల సత్యనారాయణ ను తలచుకుంటే మనకు గందరగోళంగా అనేక పాత్రలు గుర్తుకు వస్తాయి. ఒక విలన్, ఒక కమెడియన్, కేరక్టర్ యాక్టర్, హీరో, హీరోకు స్నేహితుడు, డూప్ పాత్రలు చేసే నటుడు, నిర్మాత అన్నీ కంగాళీగా మన బుర్రలో చొరబడతాయి. ఫలానా నటుడు ఫలానా రకం పాత్రలకు బాగుంటాడు.. అనే ముద్ర తనమీద లేకుండా.. ఎలాంటి పాత్ర వచ్చినా సరే.. దానిని అత్యద్భుతంగా రక్తి కట్టించిన నటుడు కైకాల సత్యనారాయణ. అందుకే ఆయన ‘నవరస నటసార్వభౌమ’ అనిపించుకున్నారు.
కైకాల సత్యనారాయణ పేరు చెబితే.. నవరసాలు గుర్తుకు రావొచ్చు గాక.. కానీ.. తెలుగు వెండితెరకు యముడు అనే పాత్ర గుర్తుకువస్తే ఒక్క సత్యనారాయణ మాత్రమే మదిలో మెదలుతారు. ముందే చెప్పుకున్నట్టు అలాంటి అరుదైన ఘనత ఎన్టీఆర్ తర్వాత.. ఆయనకు డూప్ వేషాలతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఆయనకు అభిమానపాత్రుడిగా ఎదిగి, ఆయనకు దీటైన విలన్ గా కూడా రక్తికట్టిస్తూ రంజింపజేసిన సత్యనారాయణకు మాత్రమే దక్కింది.
అందుకే.. ఆయన మరణం అంటే.. యముడు స్వర్గానికి వెళ్తున్న ఘట్టంగా మనకు అనిపిస్తోంది. మన ఊహల్లో.. ‘యముండ’ అంటూ ఆ ఒక్క పదం ఉచ్ఛారణలో నవరసాలను కూడా ఒలికిస్తూ.. స్వర్గపురి సింహద్వారం వద్ద తన రాకను తెలియజేసే సింహనాదంతో అలరించే సత్యనారాయణ మన మదిలోకి వస్తారు.
ఆయన స్మృతికి ఆదర్శిని నివాళి అర్పిస్తోంది.
Discussion about this post