బీజేపీకి, పవన్ మధ్య ఏర్పడిన పవర్ బంధానికి, ఆ బలానికి కేసీఆర్ చెక్ పెడతారా? పవర్ స్టార్ సహకారం కూడా తీసుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దున్నేయాలని బీజేపీ కలలు కంటోంది. కానీ పవన్ ను ఒంటరిని చేసి సినీ రంగాన్ని తన వెంట నడుపుకునేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్ వేశారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు హామీలు గుప్పించబోతున్నారు. బీజేపీ ని ఎదుర్కోవడం, సినీ రంగం మద్దతు తన పార్టీకే కొనసాగేలా చూసుకోవడమనే ద్విముఖ వ్యూహం తో కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
‘‘రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబాయి, చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుంది. కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మానిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవర్ బంధం పరిస్థితేంటి?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సినీ వర్గాల నుంచి కూడా నటుల్ని ప్రచార పర్వంలో దింపేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పోసాని కృష్ణమురళి రంగంలోకి వచ్చి చాలా ఘాటు వ్యాఖ్యలతో కేసీఆర్ కు మద్దతిచ్చారు. అదే క్రమంలో మరికొందరు కూడా ప్రచారానికి వస్తారని సమాచారం. పవర్ స్టార్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. సినీ ఆకర్షణను ఓటుగా మార్చుకోవడానికి బీజేపీ సిద్ధమవుతోంటే.. వారికి కేసీఆర్ ప్రయత్నాలు ఎలా చెక్ పెడతాయో చూడాలి.
.