గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రజలకు తాయిలాల వరాలను ప్రకటించారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలందరూ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య నీటి సమస్య. ప్రభుత్వం ఇప్పటికే మహానగరంలో ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తూ, దానికి అనుగుణంగా బిల్లులు వసూలు చేస్తోంది. ఈ నేపధ్యంలో గ్రేటర్ ప్రజలకు నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కేసీఆర్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు.
గ్రేటర్ ప్రజలు దాదాపు 98 శాతం మంది ఈ ఏడాది డిసెంబర్ నుండి 20 వేల లీటర్ల వరకు ఎలాంటి నీటి బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు హైదరాబాద్ ఒక గొప్ప చారిత్రక నగరమని, ప్రపంచం నలుమూలల నుండి ఎవరి వచ్చినా వారిని అక్కున చేర్చుకునే నగరమని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో ఇది ఒక కాస్మోపాలిటన్ నగరంగా రూపొందిందని ఆయన అన్నారు. అలాంటి నగరంలో ఇకపై నీటి కొరత ఉండబోదని గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అన్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబీఘాట్ లకు ఉచిత నీటిని సరఫరా చేస్తామని, సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్ లకు ఉచిత కరెంటును సరఫరా చేస్తామనిఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం ఒక పూలబొకేలాంటి నగరమని, త్వరలోనే సమగ్ర జీహెచ్ ఎంసీ చట్టాన్ని రూపొందించి, అధికారుల్లో బాధ్యత పెంపొందేలా ఈ చట్టానికి రూపకల్పన చేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా గ్రేటర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
.