జర్నలిస్టులు రాజకీయ నాయకుల నుంచి అనుచిత ప్రయోజనాలను ఆశించడం ఈ రోజుల్లో చాలా మామూలు అయిపోయింది. ప్రత్యేకించి ఎన్నికల సమయాల్లో.. విచ్చలవిడి ఖర్చులకు తెగబడుతూ ఉండే సమయంలో జర్నలిస్టులు కూడా అదను గనుక.. వారినుంచి మరింతగా పిండుకోవాలని ఆశించడం కూడా మామూలైపోయింది.
‘ఓటుకు ఇంత’ అని ముట్టజెప్పడం అనేది నయా ప్రజాస్వామ్య సాంప్రదాయంగా మారిపోయిన తర్వాత.. ‘మా సంగతి ఏం’టని వచ్చి ప్రశ్నించే విలేకరులందరినీ కూడా.. ఒక కుటుంబం యూనిట్ ఓట్లుగా పరిగణించి.. ఆ దామాషాకు కొంచెం కుడిఎడమగా ముట్టజెప్పి.. వారిలో అనుకూలతను పాదుగొల్పే ప్రయత్నాలు రాజకీయ నాయకులకు సహజం అయ్యాయి.
ఏ ఎన్నికల్లో అయినా.. వారు పెట్టే ఖర్చులో ఇలాంటి జర్నలిస్టుల దందాలు పరిమితం మాత్రమే. మీడియా సంస్థలకు రాజకీయ పార్టీలు టోకుగా ముట్టజెప్పి- అనుకూల ప్రచారాన్ని గంపగుత్తగా కొనుక్కోవడం మొదలైన తర్వాత.. స్థానికంగా జర్నలిస్టులకు దక్కే తాయిలం తక్కువే. అయితే తాజా వాతావరణంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఇలాంటి సూత్రాలకు అతీతంగా నిలుస్తోంది. కుప్పంలో మునిసిపల్ ఎన్నికలు అనేవి.. జర్నలిస్టులకు జాక్ పాట్ తగిలిన చందంగా తయారవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ మునిసిపాలిటీలోనూ పెట్టనంత భారీ ఖర్చు కుప్పంలో ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు కూడా భారీగా ముట్టజెబుతున్నారు. కుప్పం అనేది చిత్తూరు జిల్లాకు మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక మూలన విసిరేసినట్టుగా ఉండే వెనుకబడిన ప్రాంతం. నిజానికి ఈ ప్రాంతంలో విలేకరులుగా మనుషులు దొరకడమే ఒకప్పట్లో చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ‘‘లోకల్ రిపోర్టర్లు వారి జీవితంలో ఎన్నడూ ఎరగనంత భారీ మొత్తాలను పార్టీలనుంచి పుచ్చుకుంటున్నారని’’ కుప్పం పరిణామాలను దగ్గరినుంచి పరిశీలిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.
అధికారిక సమాచారం కాదు గానీ.. కర్ణాకర్ణిగా తెలుస్తున్న దాన్ని బట్టి ప్రధాన పత్రికలకు, చానెళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోకల్ రిపోర్టర్లకు ఒక్కొక్కరికి కనీసం లక్షకు తక్కువ లేకుండా ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. లోకల్ రిపోర్టర్లు అందరినీ ఒకే గాటన కట్టేయడానికి కూడా వీల్లేదు. పార్టీలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా, సొమ్ములు పుచ్చుకోకుండా నిజాయితీగా తమకు తోచిన వార్తలు రాస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు.
‘‘పెద్ద పత్రికల వారికి చాలా భారీగా ముడుతోంది. ఏదో స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా.. ప్రలోభాలు, డబ్బు పంపిణీ.. అనే సోది వార్తలు రాయడం తప్ప.. ఏ పత్రికా కూడా.. స్థానికంగా ఈ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న అసలు అరాచకాన్ని ఎత్తిచూపలేకపోతోంది. ఎవరూ ఉన్నదున్నట్టుగా రాయడం లేదు’’ అని జిల్లాకు చెందిన మరో సీనియర్ జర్నలిస్టు ‘ఆదర్శిని’తో అన్నారు. జర్నలిస్టు అనే టాగ్ లైన్ ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీల నుంచి ఎంతో కొంత ముడుతూనే ఉందని తెలుస్తోంది. ‘నేను ఫలానా పత్రిక’ అంటూ ఎవ్వరికీ తెలియని పేరు చెప్పినా, ఫలానా యూట్యూబ్ ఛానెల్ అంటూ ఏదో ఒక వీడియో ఫోనులో చూపించినా.. అలాంటివారికి కూడా ఇరవై ముప్పయి వేల వంతున ముట్టజెబుతున్నట్టు సమాచారం.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
అయితే కుప్పం స్థానిక జర్నలిస్టులకు డబ్బు వితరణ వ్యవహారాలపై మరోవాదన ఉంది. ‘‘కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో.. జిల్లా స్టాఫర్లు, చిత్తూరు, తిరుపతిల నుంచి పెద్ద హోదాలున్న రిపోర్టర్లు కూడా కవరేజీకి వస్తున్నారు. అలాంటి వారికి పెద్దమొత్తాలు ముడుతున్నాయేమో తప్ప.. స్థానికంగా ఉంటున్న వారికి మరీ అంత సొమ్ములు ఇవ్వడం లేదు’’ అని ఓ కుప్పం జర్నలిస్టు చెప్పడం గమనార్హం.
ఎందుకు ఇంతగా..
ఓట్లు మొత్తం కురిసే డబ్బు మోతాదును బట్టిమాత్రమే పడే పరిస్థితి. అయితే జర్నలిస్టులకు కూడా అడగని వారిది పాపం అన్నట్టుగా సొమ్ముల పందేరం ఎందుకు చేస్తున్నారు? అనే దానికి కూడా స్థానికుల నుంచి సరైన సమాధానాలే ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరూ తీసిపోకుండా ఉభయ పార్టీలూ అరాచకాలకు పాల్పడుతున్నాయి. ఆ విషయంలో అధికార పార్టీకి కొంత ఎడ్వాంటేజీ ఉంటుంది. అయితే జర్నలిస్టులు కుప్పంలో జరుగుతున్న అరాచక వ్యవహారాలను, విచ్చలవిడి ధోరణులను ఉన్నదున్నట్టుగా బాహ్యప్రపంచానికి చెప్పకుండా ఉండేందుకే ఇదంతా అనే వాదన ఉంది.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
జర్నలిస్టులు దారి తప్పడం కొత్త విషయం కాదు. సంస్థలు భారీ బేరాలతో దండుకుంటున్నప్పుడు- కిందిస్థాయిలోని వారు తమ తమ తాహతుకు తగ్గట్టు ఎంగిలిపడడం అక్కడక్కడా కనిపిస్తున్నదే. కానీ జర్నలిస్టులను పనిగట్టుకుని దారితప్పేలా చేసే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించే కుప్పం మునిసిపాలిటీ వంటి ఎన్నికలు అలాంటి పరిణామాలకు వేదిక అవుతున్నాయి.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు,

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.