విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చల్లదనానికి పేరుపడ్డ పర్యాటక ప్రాంతాల్లో లంబసింగి చెప్పుకోదగ్గది. ఇది విశాఖపట్నంకి వంద కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ గ్రామాన్ని ఆంధ్రా ఊటీగా చెబుతారు. ఈ గ్రామం సముద్ర మట్టానికి సుమారుగా నాలుగువేల అడుగుల ఎత్తలో వుంటుంది. దీంతో ఇక్కడ వాతావరణం సహజంగానే చల్లగా వుంటుంది. ఇక డిసెంబరు, జనవరి నెలలంటే చెప్పనవసరం లేదు.
అక్కడ సహజ ఉష్ణోగ్రతలు మామూలుగా తక్కువగా వుంటాయి. ఇక చలికాలం అంటే దాదాపుగా సున్న డిగ్రీలకు పడిపోతాయి. ప్రకృతి ప్రేమికులు ఇక్కడి అందాలను చూడడానికి డిసెంబరు, .జనవరి నెలల్లోఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అక్కడ మంచు దట్టంగా కమ్మేస్తూవుంది. అక్కడి ఉష్ణోగ్రత సుమారు ఏడు డిగ్రీలకు పడిపోయింది. రోడ్లంతా దట్టమైన మంచు కమ్మేయడంతో అక్కడికి వెళ్లే దారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.
అసలే క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో చాలామంది పర్యాటకులు చలో లంబసింగి అంటూ వాహనాలు వేసుకుని టూర్లకు బయల్దేరారు. దీంతో అటు మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనుపించకపోవడం, దారి కనిపించకపోవడం వంటి కారణాల వల్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి స్థానిక యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాహనాలు ముందుకు వెళ్లడానికి సహకరిస్తున్నారు. ఏది ఏమైనా మంచు కురిసేవేళలో లంబసింగి అందాలను చూడాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగితే మరింత మజాగా వుంటుంది కదా…!
.

Discussion about this post