నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా కాలంగా తమ హీరో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. మాంఛి విజయం కోసం మొహం వాచిపోయి ఉన్నారు. బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్న అఖండ కోసం వారు చాలా ఆత్రంగానే ఎదురుచూశారు.
సుమారు ఏడాదికి పైగా వారిని ఊరించిన అఖండ.. ఎట్టకేలకు థియేటర్లలో ప్రత్యక్షం అయ్యాడు. మరి వారి ఆశలను తీర్చాడా? మెప్పించాడా?
బోయపాటి కాంబినేషన్లో బాలయ్య బాబు అనగానే ఎక్స్ పెక్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది అఖండ. కానీ.. ఆ అభిమానుల ఎక్స్‌పెక్టేషన్ ఇతర ప్రేక్షకలోకానికి కనెక్ట్ అవుతుందా అనేది చూడాలి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ :
అనంతపురం ఫాక్షన్ ప్రభావం ఉన్న ఒక పల్లెటూరిలో.. ఫాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబంలో కవల పిల్లలు పుడతారు. వారు పుట్టే సమయానికే అక్కడకు ఓ స్వామీజీ (జగపతిబాబు) వస్తాడు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు ప్రకృతి- మరొకడు ప్రళయం అని చెబుతాడు. ఆ ఇద్దరిలో ఒక పసికందుకు శ్వాస ఆడదు. వాడే ప్రళయం అని- వాడు వినాశనం అని ప్రకటించేసి.. శ్వాస ఆడని పసివాడిని తీసుకెళ్లిపోతాడు. ఓ ముష్టివాడి పాల్జేస్తాడు.
also read : విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..
పల్లెలోనే పెరిగిన పిల్లవాడే.. మురళీకృష్ణ (నందమూరి బాలకృష్ణ). ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఫాక్షన్ ను రూపుమాపడానికి ప్రయత్నిస్తుంటాడు. అందరినీ మార్చాలనేది అతని లక్ష్యం. కాలేజీలు, ఆసుపత్రులు కట్టించి సంఘసేవ చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జిల్లాకు కలెక్టరుగా వచ్చిన ప్రగ్యాజైశ్వాల్ మారువేషంలో పల్లెల్లోని పరిస్థితుల్ని చూడడానికి ఆటోలో వస్తూ.. అదే సమయానికి ఫాక్షనిస్టులతో ఫైట్ చేస్తున్న బాలయ్యబాబును చూసి ప్రేమలో పడిపోతుంది.
అక్రమంగా యురేనియం తవ్వకాలు చేపడుతున్న మైనింగ్ మాఫియా (శ్రీకాంత్) మురళీకృష్ణకు చెందిన కాలేజీలు, హాస్పిటళ్లలో బాంబులు పెట్టించి అవి పేలిపోయేలా చేస్తుంది. ఆ ప్రమాదంలో అనేకమంది మరణిస్తారు. పోలీసులు వచ్చి మురళీ కృష్ణను అరెస్టు చేసి తీసుకెళ్తారు.
also read : హృదయాన్ని కదిలించే ‘వెన్నెల సిరి’
మురళీకృష్ణ భార్య, కూతురును విలన్ మనుషులు చంపడానికి వెంటపడతారు. ఆమె పారిపోయే ప్రయత్నంలో అనుకోకుండా అఖండ చెంతకు వెళుతుంది.
అఖండ మరెవరో కాదు. పుట్టినప్పుడే శ్వాసలేకుండా పుట్టిన, బిచ్చమెత్తుకునే సాధువు పాలైన మురళీకృష్ణ కవల సోదరుడే. సాక్షాత్తూ శివుడి రూపంగా, శివుడి దూతగా ఈ అఖండను చెబుతారు. అతడే ఒక ప్రళయం అని పుట్టినప్పుడే అనిపించుకున్న అఖండ.. దేశమంతా దేవాలయాల పునరుద్ధరణకు నడుంబిగించి.. అలా తిరగడంలో భాగంగా ఆ సమయానికి అక్కడకు వస్తాడు.
also read : అక్షరాల దారుల్లో -3 : సిరివెన్నెల స్మృతులు
ప్రకృతి అనిపించుకున్న మురళీకృష్ణ జైలు పాలవుతాడు.. ప్రళయం అనిపించుకున్న అఖండ రంగప్రవేశం చేస్తాడు.
ప్రకృతికి చేటు చేస్తే.. ఇక మిగిలేది ప్రళయమే.. అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తాడు దర్శకుడు.
ఇక అక్కడినుంచి హైఓల్టేజీ సినిమా మొదలవుతుంది. మురళీకృష్ణ జైలునుంచి ఎలా బయటపడ్డాడు. ఆ కుటుంబం రక్షణ ఎలా జరిగింది. విలన్లు ఎలా అంతమొందారు అనేది తతిమ్మా వెండితెరపైనే చూడాల్సిన కథ.
నటీనటులు :
నటీనటుల గురించి ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. సినిమా మొత్తం బాలయ్య బాబు వన్ మేన్ షో లాగా నడుస్తుంది. వయసు పైబడిన ఆనవాళ్లు స్పష్టంగా తెలిసిపోతున్నా.. హైఓల్టేజీ డైలాగ్ డెలివరీతో.. తన మార్కు కోరుకునే ప్రేక్షకుల కోసం బాలయ్య చాలానే కష్టపడ్డాడు.
మైనింగ్ మాఫియాకు కేంద్రం గా శ్రీకాంత్ విలనీ పేలవంగా ఉంది. విలన్లకు నటులను ఎంచుకోవడంలో వెరైటీ కోసం చూస్తే చాలదు.. ఆ రోల్ చేయగల కంటెంట్ ఉన్నవారిని ఎంచుకోవాలని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. జగపతి బాబు పరవాలేదు. ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్ కంటెంట్ గానే చిత్రంలో కనిపిస్తుంది.
సాంకేతికవర్గం :
ఎం.రత్నం అందించిన మాటలు బాగున్నాయి. పాత్రోచితంగా ఉన్నాయి. ఎక్కడైనా ఎబ్బెట్టుగా అనిపించినా, అతిగా అనిపించినా.. అలాంటి డైలాగుల విషయంలో రైటర్ కు స్వేచ్ఛ ఉండదనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ‘పబ్లిక్ వాంట్స్ దట్ అతి’ అన్నట్లుగా అనిపిస్తే వింత కాదు. కెమెరా పనితనం ఓకే. ‘అడిగా అడిగా’ పాట బోరు కొట్టిస్తుంది. తమన్ అందించిన సంగీతం చిత్రానికి చాలా ప్లస్ అవుతుంది. పాటలకంటె బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలాంటి హైఓల్టేజీ సినిమాలకు ఎలా ఉండాలో అలా అందించాడు తమన్. అఖండ ఇంట్రడక్షన్ సీన్లు అదిరిపోతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
also read : అమెరికా ‘మనబడి’లో మహామనీషి శాస్త్రి గారు!
మైనింగ్ మాఫియా శ్రీకాంత్ ను చంపే విధానం బహుశా బాలయ్య బాబు అభిమానులకు బాగానే కిక్ ఇస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం ఇంకో పది సినిమాలు వచ్చినా సరే ఇదే తరహాలో ఉంటుంది. అందులో పెద్ద మార్పేం ఉండదు. ఏ విమర్శ చేసినా సరే.. అభిమానులకు అలాగే ఉండాలి అని సర్ది చెప్పుకుంటారు గనుక.. పెద్దగా చెప్పేదేం లేదు.
విశ్లేషణ :
బాలయ్యను అఖండగా చూపించడం ఒక ప్లస్. ఆ ఎలిమెంట్ ని సస్టయిన్ చేశారు. తతిమ్మా చాలా రొటీన్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చిరాకు పుట్టిస్తుంది. అఖండ వచ్చాక సినిమాను కాస్త తన భుజబలం, నోటి బలంతో, అరుపులతో కాపాడతాడు. సెకండాఫ్ వేగంగానే నడుస్తుంది. కానీ సినిమా చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. వెకిలి హాస్యం పండించడం కోసం సినిమాకు అతికించిన కల్లు కాంపౌండ్ రొమాంటిక్ సీను, గుళ్లో పేకాట రాయుళ్లకు ఉపన్యాసం ఇచ్చే సీను కత్తిరించేస్తే.. ప్రేక్షకులను కాపాడినట్లు అవుతుంది. లెంగ్త్ తగ్గుతుంది. సినిమాలో బోరు కూడా తగ్గుతుంది.
also read : విధాత తలపున ప్రభవించిన వాడు..
ఒకటి రెండు కొత్త ఆలోచనలతో, అనేకానేక పాచి ఆలోచనలను కలిపేసి.. భారీబడ్జెట్ సినిమాగా అందించేస్తే ఎలా ఉంటుంది? అఖండలా ఉంటుంది! హీరో రోడ్డు మీద ఫైట్ చేయడం చూసి హీరోయిన్ (అది కూడా ఐఏఎస్ చదివిన జిల్లా కలెక్టర్) ఢామ్మని ప్రేమలో పడిపోవడం.. ఏ కాలం నాటి సినిమా రెసిపీ! మైనింగ్ మాఫియా జనం చావులకు కారణం అవుతోంటే, వారిని ఉద్ధరించడానికి అవతరించిన శివస్వరూపంగా హీరోని ఎస్టాబ్లిష్ చేయడం.. కొత్త పాయింటేనా? బాక్సాఫీసు వద్ద చీదేసిన ఖలేజా ఇలాంటి వికట ప్రయోగమే కదా! హీరో ఊరిని ఉద్ధరించే ఫాక్షన్ ను అంతమొందించాలనుకునే మంచి వాడు కావడం కొత్త సంగతా?
also read : పాటతో మమేకమైన తత్వవేత్త.. సిరివెన్నెల
నిజానికి కొత్త దనంతో కథ చెప్పాలని దర్శకుడు బోయపాటి కూడా అనుకోలేదు. అందుకే అఖండి ఇలా తయారైంది. బాలయ్య బాబు హై ఓల్టేజీని చూడడానికి మాత్రమే ఈ చిత్రానికి వెళ్లాలి. కథ, లాజిక్ ఇలాంటివన్నీ అడగకూడదు. సినిమా పరవాలేదనిపిస్తుంది గానీ.. అభిమానులకు మాత్రం పండగే.
also read : నవతరం అన్నమయ్య సిరివెన్నెల
సింహా, లెజెండ్ సినిమాలు తీసిన తర్వాత.. బోయపాటి కాంబినేషన్ లో బాలయ్యకు ఇది హ్యాట్రిక్ చిత్రం కావడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. కాంబినేషన్ మాత్రమే హ్యాట్రిక్.. ఫలితం పరంగా చూస్తే ఆ రెండు చిత్రాలకు మధ్యలో ఇది నిలబడవచ్చు.
వన్ లైనర్ :
అఖండ ఒక ప్రళయం.. జాగ్రత్త చూసుకుని వెళ్లండి
.. స్వర్ణ సుందరి
Discussion about this post