ఈ పనులే అనుమానాలు పెంచేది!

325

తబ్లిగీ జమాత్ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో ప్రభుత్వాలు వారి కోసం గాలించి, వారికి వైద్యపరీక్షలు చేయించే ప్రయత్నాల్లో ఉన్నాయి. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు కొందరు ఇప్పటిదాకా ఆచూకీ తెలియకుండా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఈ అంశాన్ని యావత్ ముస్లిం సమాజానికి పులమడానికి హిందూ వాద సంస్థలు, వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కుటిలయత్నాలు బాధాకరం. అదేసమయంలో మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు, ప్రభుత్వానికి దొరక్కుండా వైద్యపరీక్షలకు అందుబాటులోకి రాకుండా దాక్కోవడం కూడా మరింత బాధాకరం. సరైన అవగాహన లేకుండా వారు చేస్తున్న ఇలాంటి పనులే యావత్ ముస్లింల మీద నిందలు పడడానికి కారణం అవుతున్నాయి. 

లక్నోలోని సదర్ బజార్ మసీదులో ఓ సంఘటన వెలుగు చూసింది. ఆ మసీదులోకి ప్రతిరోజూ ఆహార పొట్లాలు సరఫరా అవుతుండడం చూసి స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ ఆద్వర్యంలో దాడిచేసి, తబ్లిగీ జమాత్ సభ్యులు 14 మందిని పట్టుకున్నారు. వీరు మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు. వీరికి కరోనా సోకి ఉంటుందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలకు పంపారు. ప్రస్తుతానికి ఐసొలేషన్ కు తరలించారు. ఇంతకూ వీరు ఎందుకు దాక్కున్నట్టు. తబ్లిగీ జమాత్ అనేది ఉగ్రవాద వ్యవహారం కాదు. కేవలం మతపరమైన వ్యవహారం మాత్రమే. అయినా కరోనాతో ముడిపడి దానిమీద ఆరోపణలు రాగానే, వీరు  తమంతగా ప్రభుత్వం వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సింది బదులుగా, మసీదులో దాక్కోవడం ప్రజల్లో అనుమానాలు పెంచడంలో ఆశ్చర్యం లేదు. 

ముస్లింలలోని కొందరు వ్యక్తులు కేవలం మతపరమైన సమావేశం అనే ఉద్దేశంతోనే మర్కజ్ కు వెళ్లారు. దురదృష్టవశాత్తూ వారికి కరోనా సోకింది. అందుకని.. ముస్లిం జాతిని నిందించడం అనేది నీతిబాహ్యం. కానీ, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. ప్రధానంగా భాజపా అనుకూల వ్యక్తులు కార్యకర్తలు, దీనితో ముడిపెట్టి ప్రజల్లోకి విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. పాత వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. కరోనా వ్యాప్తికి ముస్లింలు ప్రయత్నిస్తున్నారనే విషాన్ని వెదజల్లుతున్నారు. యావత్ సమాజాన్ని భయపెడుతున్నారు. ముస్లిం వ్యతిరేకతను తటస్థుల్లో కూడా నాటడానికి కుట్రలు పన్నుతున్నారు.

ఇలాంటి సమయంలో ముస్లింలకు బాధ కలగడం సహజం. కానీ వారు కూడా  సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారి వివరాలు స్వచ్ఛందంగానే ప్రభుత్వానికి తెలియజేయాలి. మర్కజ్ కు వెళ్లడం తప్పు కాదని ముందుగా వారు నమ్మాలి. కరోనా పరీక్షలు చేయించుకోవడం, సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తేల్చుకోవడం.. వారి కుటుంబాలకు మాత్రమే కాదు, సమాజానికి కూడా అవసరమని వారు తెలుసుకోవాలి. పరిణామాలు ఎలా జరిగినప్పటికీ.. సంక్లిష్టమైన భారతదేశంలో మతాల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతినకుండా అందరూ దృష్టి పెట్టాలి.

Facebook Comments