“పరాభవ” నామ ఉగాది వచ్చింది. పరాభవం ఎవరికో తెలీదు గాని… ప్రభావం మాత్రం అందరిపై పడుతోంది. ఎక్కడో ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం… పెత్తనం చేయాలని అమెరికా తహ తహ! దాన్ని అధిగమించాలని రష్యా వ్యూహం. ప్రపంచంలో అందరికీ గ్యాస్ సమస్య మొదలు.
మూత పడుతున్న వ్యాపారాలు… వంట గ్యాస్ పై కూడా నీలి నీడలు… భయం లేదంటున్న ప్రభుత్వాలు… స్విగ్గీ జోమోటాలకు ఆర్డర్లు మీద ఆర్డర్లు… వారికీ అవసరం కదా గ్యాస్… పరాభవం రాక ముందే ప్రభావం… త్వరలో ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం.. మొదలు పెట్టిందే పెద్దన్న… యుద్ధం వ్యయం పెరుగుతోందని వేదన… గ్యాస్ పై ప్రతిపక్షాలు ఆరోపణల యుద్ధం… ప్రత్యేక నౌకలతో మోడీ విదేశీ వ్యూహం… రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలు… ప్రభుత్వాల మేకపోతు గాంభీర్యాలు… ప్రత్యామ్నాయ పద్ధతులు అన్వేషణ…
వంట చెరకుకు పెరిగిన డిమాండ్… పరాభవం రాక ముందే ఈ ప్రభావాలు… వచ్చిన తరువాత ముగిసేనా సమస్యలు… వికారిలో వికారాలు వచ్చాయా…? విరోధిలో వైరుధ్యం పెరిగిందా…? క్రోధలో కోపం మాత్రమే వచ్చిందా..? రౌద్రలో రుద్ర తాండవం జరిగిందా..? రక్తాక్షిలో మాత్రమే రక్తం పారిందా…? వికృతిలో అన్నీ విలయాలేనా..? విశ్వావసులో అన్నీ శుభాలే జరిగాయా..?
పరాభవంలో కూడా అంతే… ఇదిగో తోక అంటే అదిగో పులి అనే వారు ఎప్పుడూ ఉండనే ఉంటారు… ఆదాయ వ్యయాలైనా.. రాజపూజ్యం అవమానాలైనా… మంచి చెడు అయినా… శుభాశుభాలైనా మన మనసులోనివే… పరాభవం జరిగినా అబ్బే ప్రభావం లేదనుకుంటే అదే శుభం..
ఎవరికీ పరాభవం ఉండకూడదని.. దాని ప్రభావం చూపకూడదని… అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని.. యుద్ధాలు సుఖాంతం కావాలని… మరే యుద్ధాలు జరగరాదని… శాంతి వికసించి పరాభవం పరార్ కావాలని… ఆశిస్తూ.. ఆకాంక్షిస్తూ… సాకారం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ… సర్వేజనా సుఖినోభవంతు…
..ఎం.వి.రమణ,
సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి…
.

Discussion about this post