సంకల్పం స్వచ్ఛమైనదైతే, భూతభవిష్యత్ వర్తమానాలు మనల్ని దీవిస్తాయి.
ఇచ్చిపుచ్చుకోవటంలోని సంతోషాన్ని అనుభవించగలిగితే, సంతృప్తి గుండెలు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
నాకు తెలిసిన ఓ పెద్దాయన సంకల్పానికి సంబంధించిన కథ ఇది…
*****
దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం..
‘‘మీరే ఆదుకోవాలి బాబూ’’ అంటూ భార్యాభర్తలు చంద్రశేఖర్ గారిని ఆశ్రయించారు. వారికొచ్చిన కష్టం గురించి ఆయనకు తెలుసు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డను కాపాడుకోవటం వారికెంత ముఖ్యమో ఆయన గ్రహించారు.
ఇంట్లో వెతికారు. అతికష్టం మీద లక్ష రూపాయలు దొరికాయి. తన మిత్రుడి వద్ద మరో లక్ష అప్పు తీసుకుని ఆ దంపతుల చేతుల్లో పెట్టారు.
కన్నీరు ధారలు కడుతుండగా ఆ ఇద్దరూ కృతజ్ఞతాభావంతో ఆయనకు నమస్కరించి, అక్కడినుంచి కదిలారు.
అవసరం తీరింది. ఆపద గడిచింది. బిడ్డ ఒడ్డున పడ్డాడు.
కొన్ని నెలల తర్వాత దంపతులు మళ్లీ వచ్చారు. భర్త చేతులు జోడించి ‘‘సామీ, సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. కూలిపనుల మీద వచ్చే సొమ్ము ఏ నెలకా నెలే అస్తూబిస్తూ. మీ రుణం తీర్చుకునే దారి కనబట్టం లేదు. మా మీద దయుంచి ఈ కాగితాలు మీ దగ్గరుంచండి’’ అన్నాడు.
చంద్రశేఖర్ కాగితాలు తిప్పాడు. గుంటూరు శివారులో రోడ్డుకు వారగా ఉన్న అరెకరం భూమి పట్టా అది.
‘‘ఈ కాగితాలు నాకెందుకు?’’ ఆశ్చర్యంగా అడిగారాయన.
‘‘అరెకరం బూమి సామీ. తొండలు గుడ్లు పెట్టే నేల. గింజ మొలవదు, మొక్క బతకదు. మీరిచ్చిన రెండు లచ్చలకు ఇది సమానం కానేకాదు. కానీ, అదొక్కటే మా పేరిటున్న ఆస్తి. అందుకే దీన్ని మీ పేర రాస్తాము’’.
‘‘ఎందుకిలా చేస్తున్నారు. నేను మిమ్మల్ని డబ్బు తిరిగిమ్మని అడిగానా? దాని గురించి మర్చిపోండి’’ చెప్పారాయన.
వాళ్లిద్దరూ ఒప్పుకోలేదు. ‘మా మనసొప్పుకోదు’ అన్నారు. ‘తిన్న తిండి సయించటం లేదు’ అన్నారు. మొండిపట్టు పట్టారు.
ఆయన అయిష్టంగానే ఒప్పుకొన్నారు.
నాలుగు రోజుల వ్యవధిలో ఆ భూమి ఆయన పేరిట రిజిస్టర్ అయింది.
*****
చంద్రశేఖర్ ఐఐటీ చదివి, మంచి ఉద్యోగంలో చేరారు. నిరంతరం కంప్యూటర్‌తో కాపురం ఆయనకు నచ్చలేదు. ఏదో అశాంతి. ఇంకేదో చెయ్యాలని తహతహ. విపరీత మథనం అనంతరం ఆయనకు స్పష్టత వచ్చింది. ఉద్యోగం మానేశారు. సొంతూరికి చేరుకున్నారు. ఓ ట్రస్టు స్థాపించి, సామాజిక సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. తనకున్న పరిచయాల అండతో విరాళాలు సేకరిస్తూ ట్రస్టు ఉనికిని మరిన్ని గ్రామాలకు విస్తరింపజేశారు. మరికొందరు ఆయనకు జత కలిశారు.
స్వయంసహాయక సంఘాలను ఒక తాటి మీదకు తెచ్చి, వారికి ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాడు. ఉత్సాహంగా ముందుకొచ్చిన వారితో చిన్న వ్యాపారాలు ప్రారంభింపజేశారు.
తన సొంత భూమిలోనే గోశాల ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా గ్రామానికి తిరిగొచ్చిన వలస కూలీల్లో కొందరికి అక్కడ ఉపాధి కల్పించారు. కొద్ది నెలల్లోనే గోశాల విస్తరించింది. గోవుల సంఖ్య పెరిగింది. ఆదాయం మొదలైంది. కూలీలకు అక్కడే ఇళ్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రయత్నాలు ప్రారంభించారు.
హీనపక్షం కోటి రూపాయలు కావాలి.
సంకల్పమేమో రోజురోజుకూ బలపడుతోంది. ఎలా!?
గోశాల నుంచి బయటికి రాగానే, చంద్రశేఖర్ ఫోన్ మోగింది.
అవతలి వారు చెప్పే విషయం ఆయనకు వెంటనే అర్థం కాలేదు. అసలు ఆ స్థలమేమిటో, ఎవరిదో, ఎక్కడుందో అంతుబట్టలేదు. అదే చెప్పారాయన.
‘‘లేదు సార్. నెట్‌లో చూశాం. ఆ ల్యాండ్ మీ పేరు మీదే ఉంది’’.
‘‘సరే, రేపు మా ఇంటికి రండి. మాట్లాడుకుందాం’’ అన్నారు.
మరుసటి రోజు మధ్యాహ్నం ఇద్దరు వ్యాపారులు ఆయనింటికి వచ్చారు.
‘‘సార్, ఇప్పుడా రోడ్డు పక్క పొలాలు ప్లాటినంతో సమానం. విపరీతంగా రేట్లు పెరిగాయి. మాకో అరెకరం ల్యాండ్ అవసరమై, ఆ ప్రాంతంలో వెతుకుతుంటే మీ స్థలం కనిపించింది. ఎంతకిస్తారో చెబితే తీసుకుంటాం’’ అన్నారు.
చంద్రశేఖర్ మనోమందిరంలో ఇరవయ్యేళ్ల నాటి దృశ్యాలు లీలగా మెదిలాయి. ఆ భార్యాభర్తలు మదిలో కదిలారు. వాళ్లు తనకు రిజిస్టర్ చేసిన కాగితాలు అప్పట్నుంచీ బీరువాలో భద్రంగా అలాగే ఉన్నాయి.
చంద్రశేఖర్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి ఆ డాక్యుమెంటు తీసుకొచ్చి, వాళ్ల ముందుంచి ‘ఈ స్థలమేనా’ అని అడిగారు.
వాళ్లు పరిశీలించి, అవునన్నారు.
‘‘మీరు చెప్పండి. ఎంతకు కొంటారు?’’ బంతిని వాళ్ల కోర్టులోకే నెట్టారు చంద్రశేఖర్.
‘‘అదెలా సార్. ల్యాండ్ మీది. మీరే చెప్పండి’’ అన్నారు వాళ్లు.
‘‘పర్వాలేదు. మీరు ఎంతకు తీసుకోవాలనుకుంటున్నారో చెప్పండి’’ అన్నారు.
వాళ్లద్దరూ కళ్లతోనే మాట్లాడుకున్నారు.
‘‘అది… కోటిన్నరకైతే వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం సార్’’ ఒకతను చెప్పాడు.
‘‘సరే, తీసేసుకోండి’’.
ఒకటీ డెబ్భై అయిదు దాకా సిద్ధమై వచ్చిన ఆ వ్యాపారులు ప్రభు సమాధానంతో కంగు తిన్నారు. తాము విన్నది నిజమా కాదా అని మొహమొహాలు చూసుకున్నారు.
‘‘మీరు సరిగానే విన్నారు. అత్యాశ అతిపెద్ద రోగం. నాకా రోగం లేదు. మీరు ఏర్పాట్లు చేసుకోండి’’ అన్నారు చంద్రశేఖర్.
వారిద్దరూ దండాలు పెట్టి, సంతోషంగా వెనుదిరిగారు.
పదిరోజుల్లోపే రిజిస్ట్రేషన్ పూర్తయింది. కోటిన్నర చంద్రశేఖర్‌కు చేరాయి.
*****
చంద్రశేఖర్ ఉదయాన్నే బయల్దేరారు. అప్పటికే తన మిత్రులు అందించిన సమాచారం ఆధారంగా… గంటసేపు ప్రయాణించి, ఆ కుగ్రామానికి చేరుకున్నారు.
గుడిసె బయట చిన్నతొట్టి పక్కనే అంట్లు తోముతున్న ఆమె… చంద్రశేఖర్‌ను చూసి, చేతులు కడుక్కొని చీరకు తుడుచుకుంటూ లేచి నిలబడింది.
‘‘బాగున్నారమ్మా?’’ కుశలమడిగారు చంద్రశేఖర్.
ఆమె సమాధానం చెప్పకుండా ఆయన వంక సందేహంగా చూసింది.
‘‘నేను తల్లీ… చంద్రశేఖర ప్రసాద్‌ను’’ నవ్వుతూ చెప్పారు.
అర నిమిషం తర్వాత ఆమెకు గుర్తొచ్చింది.
‘‘అయ్యో, సామీ మీరా! బాగున్నారా?’’ అంటూ కాళ్లకు నమస్కరించింది.
‘‘మీ వారు లేరా?’’
‘‘ఆయనిప్పుడే వస్తాడు సామీ. కూచ్చోండి’’ అంటూ నులకమంచం వాల్చింది.
‘‘బాబు ఏం చేస్తున్నాడు?’’
‘‘ఆడికి మెడిసిన్‌లో గవర్మెంటు సీటొచ్చింది సామీ. ఎంబీబీఎస్ అయిపోయింది. ఇప్పడదేదో సెయ్యాలంట. ఇంకా శానా అయితదంట. మా వల్ల ఏడయితది?’’ ఆమె చెబుతుండగానే బయటి నుంచి భర్త వచ్చాడు. చంద్రశేఖర్‌ను గుర్తు పట్టాక, నమస్కరించాడు.
కాసేపు కాలచక్రం కబుర్ల మధ్య తిరిగింది.
చివరికి చంద్రశేఖర్ తన జేబులోంచి ఓ చెక్కు తీసి, వారిద్దరికీ అందించారు.
‘‘ఏంది సామీ ఇది?’’
‘‘చెక్కు. యాభై లక్షలు’’.
‘‘మాకెందుకు సామీ’’ ఆమె అడిగింది.
‘‘అది మీ సొమ్మే. మీరు అప్పట్లో నాకిచ్చిన అరెకరం అమ్మగా వచ్చిన సొమ్ము. మీ అబ్బాయి పీజీ చదువుకు ఉపయోగించండి’’.
భార్యాభర్తల కళ్లు ధారాపాతంగా వర్షిస్తుండగా, ఆమె ఆప్యాయంగా చెక్కును గుండెలకు హత్తకుంది.
‘‘ఇంతేకాదు. పదిమందికి ఇళ్లు కట్టిస్తున్నాం. ఆ పుణ్యకార్యంలోనూ మీకు భాగస్వామ్యముంది’’ ఆయన వివరించి చెబుతుంటే.. ఆ దంపతులు భగవద్గీత వింటున్నట్లుగా మైమరచిపోతున్నారు.
.. ఎమ్వీ రామిరెడ్డి
Discussion about this post