వీలునామా అనేది ఒక వ్యక్తి తను సొంతంగా సంపాదించిన లేక తనకు సంపూర్ణ హక్కులతో సంక్రమించిన ఆస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలి అని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తన తదనంతరం అమలు చేయడానికి రాతపూర్వకంగా వ్రాసి ఉంచే మరణ శాసనం.
ఎవరైనా 60 ఏళ్ళు దాటిన తరువాత లేదా ఏవైనా ఆరోగ్యసమస్యలు వచ్చిన తరువాత వీలునామా రాయాలని అనుకుంటారు. అది మంచిదే కూడాను.
వీలునామా రాసి ఉంచడంలో ఉద్దేశ్యం తన తదనంతరం తన వారసులు ఎటువంటి తగాదాలు లేకుండా తన ఆస్తులను అనుభవించాలి అని ఉండాలి. వీలునామా ప్రేమ పూర్వకంగా రాసేదిగా ఉండాలి గానీ వారసుల మధ్య కలహాలు, మనస్పర్థలు తెచ్చే విధంగా ఉండకూడదు. వీలునామా రాసి కక్ష, కోపం తీర్చుకుందామని అనుకోవడం సరైనది కాదు. వీలునామా రాయడం గురించి భయం వద్దు. వీలునామా రాస్తే ఏమైనా అవుతుందేమో అని అపోహలు, సందేహాలు వద్దు.
మీ జీవిత భీమా పోలసీ లాగా, మీ బ్యాంకు అకౌంట్ కు నామినీ పెట్టినట్లు, ఉద్యోగంలో మీ తదనంతర పెన్షన్, గ్రాట్యుటీ లాంటి వాటి కోసం మీకు నామినీ పెట్టుకున్నట్లు, మీరు కష్టపడి కూడ పెట్టిన ఆస్తులను మీ వారసులకు బదలాయింపు చేయడానికి చేసుకునే ఏర్పాటు వీలునామా.
ఉన్నది ఒక్కడే కొడుకు/కూతురు లేదా ఇద్దరే పిల్లలు, ఎలాగూ తదనంతరం ఆస్తి వారికే చెందుతుంది కనుక వీలునామా అవసరం లేదు అని అనుకోవద్దు.
వీలునామా ఉంటే మీ వారసులు ఎటువంటి తగాదాలు, ఇబ్బందులు లేకుండా మీ స్థిరాస్తులను బదలాయింపు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది.
వీలునామా మీ వారసులకు ఆస్థి డాక్యుమెంటుగా ఉండడం వలన, వారి పేరుకు మార్చుకోవడానికి, బదలాయింపు చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, లోను తీసుకోవడానికి సులువుగా ఉంటుంది.
అలాగే మీ తదనంతరం నిలిచి ఉండే మీ బ్యాంకు బ్యాలన్సు, ఫిక్సడ్ డిపాజిట్లు, మీ పేరున ఉన్న షేర్లు, మీ జీవిత భీమా సొమ్ము, మీ వాహనం ట్రాన్స్ఫర్, ఎల్ పి జి గ్యాస్ కనెక్షను, మీకు ఇతరుల నుండి రావలసిన బాకీలు వసూలు, మొదలగు చరాస్తులను మీ వారసులు తేలికగా పొందడానికి మీ వీలునామా ఉపకరిస్తుంది.
వీలునామా ద్వారా ఆస్తులను ఎవరికి ఏది ఇవ్వాలో స్పష్టం చేయకుండా, ఇద్దామనుకున్న వారందరికీ సమాన వాటాలు చెందాలి అని రాయడం సరైనది కాదు. అలా రాయడం వలన మరల వారందరూ పంచుకోవడానికి పార్టిషన్ దస్తావేజు రాసుకోవడం గానీ, పార్టిషన్ దావా వేసుకోవడం గానీ చెయ్యాలి. అందు వలన వీలునామా ద్వారా ఆస్తులు సంక్రమించినా, తిరిగి వారసుల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ స్వాధీన హక్కు భుక్తములలో ఉన్న ఆస్తుల గురించి, మీరు స్వయంగా సంపాదించిన ఆస్తుల గురించి, మీకు వారసత్వ హక్కుగా సంక్రమించిన ఆస్తుల గురించి, మీరు వీలునామా రాయవచ్చును.
మీ ఉమ్మడి కుటుంబ ఆస్తులలో మీకు గల అనిర్ధిష్టపు ఉమ్మడి హక్కు గురించి కూడా మీరు వీలునామా రాయవచ్చు. కానీ అప్పుడు మీరు బదలాయింపు చేసిన వారికి కూడా అనిర్ధిష్టపు ఉమ్మడి హక్కు మాత్రమే చెందుతుంది. మీకు హక్కులేని ఆస్తుల గురించి, ఊహజనితంగా మీకు సంక్రమిస్తుంది అని అనుకునే ఆస్తుల గురించి, భవిష్యత్తులో వస్తాయి లేదా సంపాదిస్తాను అనుకునే ఆస్తుల గురించి, గాంబ్లింగ్, లాటరీ ద్వారా వస్తాయనుకునే ఆస్తుల గురించి వీలునామా రాయడానికి వీలుకాదు, చెల్లదు. అలాగే ఊహాజనిత వ్యక్తులకు, ఇప్పుడు జీవించిలేని వ్యక్తులకు, వీలునామా రాసి ఆస్తులను బదలాయింపు చేయలేరు. వీలునామాలో మీరు ఆస్తులను బదిలీ చేయించాలనుకున్న వ్యక్తులు కనీసం ఒకరైన జీవించి ఉండాలి. వారి తదనంతరం మాత్రం పుట్టబోయే ఒక సంతానానికి రాయవచ్చు. కానీ పుట్ట బోయే సంతానానికి తర్వాత పుట్టే సంతానానికి రాయడానికి వీలు లేదు.
వీలునామా రాసిన వారిని ఎక్జిక్యుటెంట్ లేదా టెస్టేటర్ అంటారు.
వీలునామా ద్వారా ఆస్థి పొందిన వారిని బెనిఫిషయరీ అంటారు.
వీలునామా తయారుచేసిన లేదా దస్తూరీ రాసిన వారిని లేఖరి అంటారు.
వీలునామాలో తప్పనిసరిగా కనిసం ఇద్దరు సాక్ష్యుల ముందర టెస్టేటరు సంతకం చెయ్యాలి.
తరువాత సాక్ష్యులు టెస్టేటర్ ముందర సంతకాలు చెయ్యాలి.
తదుపరి చివరగా టెస్టేటర్, సాక్ష్యుల, సమక్షంలో లేఖరి సంతకం చెయ్యాలి.
వీలునామాలో టెస్టేటర్ యొక్క కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, టెస్టేటరు యొక్క మొత్తం స్థిరచరాస్తుల వివరాలు, టెస్టేటరు తన తదనంతరం ఏ ఆస్తి ఎవరికి చెందేలాగున ఏర్పాటు చేస్తున్నారో, ఎవరికైనా ఆస్తి ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వటం లేదు అనే వివరం, అన్ని వివరాలు స్పష్టంగా, తేలికగా అర్థమయ్యే విధంగా, ఏ విధమైన సందిగ్ధత లేకుండా, అనుమానాలు, తేడాలు లేకుండా, పొందు పరుస్తూ తయారు చేసుకోవాలి.
వీలునామా తయారుచేసుకునే సమయంలో టెస్టేటరు పూర్తి మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి. వీలునామాలో రాసిన వివరాలు అన్నీ టెస్టేటరు స్వీయ అంగీకారంతో, ఏ విధమైన బలవంతము గానీ, ఇతరుల ప్రోద్బలంతో గానీ లేకుండా, మంచి మనస్సుతో, సదరు వీలునామా రాయడానికి తగిన మానసిక ఆరోగ్యం కలిగి ఉండి రాయించి సంతకం లేదా వేలిముద్ర చేసినారని వీలునామాలో తప్పని సరిగా పొందు పరచాలి.
వీలునామా కోర్టులో ఏదైనా కేసులో రుజువు పరుచుకోవాలి అంటే, కనీసం సాక్షిగా సంతకం చేసిన ఒక సాక్షిని విచారణ చేసుకోవాలి. సాక్షిగా సంతకం చేసిన వారు చనిపోయిన లేదా విచారణకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉంటే లేఖరిని సాక్ష్యంగా విచారణ చేయాలి. కొన్ని సార్లు వీలునామాలో సంతకం చేసిన ఎవరూ లేని పక్షంలో చనిపోయిన వారి బంధువులను విచారించి, సదరు సంతకం రుజువు చేయడం అవసరం అవుతుంది.
ఇక ముఖ్యంగా వీలునామా రాసిన విధానంలో గానీ, వీలునామా ప్రకారం చేసిన ఆస్తుల పంపకం ఏర్పాటులో గానీ, ఏ విధమైన అనుమానించ తగిన పరిస్థితులు లేవని (There are no suspicious circumstances in the execution and bequeaths made under it) రుజువు పరుచుకోవాలి.
వీలునామా విషయంలో అనుమానాస్పద అంశాలు కనుక ఉంటే కోర్టు వీలునామా నమ్మదగినది కాదు అని నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలునామా రాసే విషయంలో అన్నీ సక్రమంగా పద్ధతి ప్రకారం జరిగేటట్లు చూసుకోవాలి.
కోర్టు వీలునామాను నమ్మదగినదిగా లేదు అని నిర్ణయానికి వచ్చే కొన్ని పరిస్థితులు.
* వీలునామా టెస్టేటర్ సాధారణంగా నివసించే ఊరిలో కాకుండా వేరే ఊరిలో తయారు చేయడం.
* వీలునామా తయారుచేసిన, టెస్టేటర్ సంతకం/వేలిముద్ర వేసారని చెప్తున్న తేదీలలో టెస్టేటర్ హాస్పిటల్లో గానీ, వేరే చోట గానీ అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉండడం.
* వీలునామా రాసిన కాగితాలు అనుమానం కలిగించే విధంగా, సంతకం లేదా వేలిముద్ర వేసివున్న కాగితాలు ఉపయోగించి తయారు చేసినట్లు ఉండడం.
* వీలునామా రాసిన పద్ధతి సరైన వివరాలు లేకుండా ఉండడం లేదా తప్పుడు వివరాలతో ఉండడం.
* వీలునామాలో సాక్షి సంతకం చేసిన సాక్షులు టెస్టేటర్ కు పరిచయం లేని వారు అవడం, వీలునామా ప్రకారం ఆస్తులు పొందిన బెనిఫిషయరీకు తెలిసిన వారు అవడం.
* టెస్టేటర్ చేత వీలునామా రాయించడంలో బెనిఫిషియారీ పాత్ర, చొరవ ఎక్కువగా, అనుమానాస్పదంగా ఉండడం.
* వీలునామాలో ఒకరికో ఇద్దరికో ఆస్తి ఇచ్చి మిగిలిన వారసులకు సరైన కారణం లేకుండా ఏమీ ఇవ్వకుండా ఉండడం.
* వీలునామాలో సాధారణంగా సమానంగా చేయవలసిన ఆస్తుల పంపకం చేయకుండా, హెచ్చు తగ్గులుగా పంపకాలు చేయడం.
* టెస్టేటర్ సాధారణ ప్రవర్తన, వారసులతో సంబంధాలకు బిన్నంగా వీలునామాలో పంపకాలు చేసినట్లు ఉండడం.
* టెస్టేటర్ వారసులు అందరినీ కాదని దూరపు బంధువుకో, సంబంధం లేని వ్యక్తికో, సంస్థకో ఆస్తులు బదలాయింపు చేసినట్లు వీలునామాలో ఉండడం.
పైన తెలిపిన కారణాలే కాకుండా వేరే అనుమానాస్పద కారణాలు సదరు వీలునామాను నమ్మదగినదిగా అనిపించక పోవడం వలన కోర్టు సదరు వీలునామాను సరైనదిగా అంగీకరించక పోవచ్చు. కనుక ఇటువంటి అనుమానాస్పద కారణాలు లేకుండా వీలునామాను పూర్తిగా అమోద్యయోగ్యంగా ఉండేటట్లు రాసుకోవాలి.
వీలునామా ఎవరి పేరు మీదనా రాయడం ఉండదు.
“పలాన పట్టన/ గ్రామంలో నివసించే పలాన వారి కొడుకు/కూతురు/ భార్య అయిన నేను నా స్వబుద్దితో, పూర్తి అంగీకారంతో, నిర్మలమైన మనస్సుతో, మానసిక ఆరోగ్యంతో, పూర్తి అవగాహనతో, వ్రాయించిన వీలునామా” అని మొదలుపెట్టి వ్రాయాలి.
తరువాత కుటుంబ సభ్యుల వివరాలు, స్థిరచరాస్తుల వివరాలు, ఇతర వివరాలు రాసి ఆస్తులు ఎవరెవరికి ఏ ఆస్తి చెందవలనో స్పష్టంగా రాయాలి.
చివరికి సదరు వీలునామా తన జీవిత తదనంతరం అమలులోకి రావలెనని, తన జీవిత కాలంలో అవసరమైనచో రద్దు చేసుకునే హక్కు తనకు ఉంటుంది అని రాయించుకోవాలి.
భార్యాభర్తలు కలిసి ఒకే వీలునామా రాయవచ్చు. కానీ వివరాలు జాగ్రత్తగా స్పష్టంగా రాసుకోవాలి.
వీలునామా ద్వారా ఆస్తులను వారసులకు బదలాయింపు చేయడమే కాకుండా, ఆ వీలునామా అమలు జరగడం కోసం ఎవరినైనా ఎగ్జిక్యూటర్ గా నియమించవచ్చును.
వీలునామాకు అనుబంధ వీలునామా రాసుకోవచ్చు. దానిని “కొడిసిల్ ఆఫ్ విల్” అని అంటారు.
వీలునామా స్టాంపు పేపరు మీద రాయాల్సిన అవసరం లేదు. మామూలు పేపరు మీద రాసినా చెల్లుతుంది.
అయితే ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే దళసరి కాంక్వెస్టు పేపరు మీద రాసుకోవడం మంచిది.
వీలునామా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు.
వీలునామా కంపెల్సరీ రిజిస్ట్రేషన్ చేయవలసిన డాక్యుమెంట్ల జాబితాలో లేదు.
కానీ చాలా మంది వీలునామా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు.
అది తప్పుడు అపోహ మాత్రమే.
అయితే సరైన అవగాహన లేని కొందరు బ్యాంకు ఉద్యోగులు వీలునామా రిజిస్ట్రేషన్ చేయించలేదని లోను ఇవ్వడానికి తప్పుగా తిరస్కరించడం కూడా జరుగుతోంది.
రిజిస్ట్రేషన్ వలన వీలునామా రుజువు చేసుకోవడానికి కొంత సాక్ష్యం లభిస్తుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న అటెస్టేషన్ సాక్షులను కూడా వీలునామా రుజువు కోసం విచారణ చేసుకోవచ్చు.
అలాగే రిజిస్ట్రేషన్ వలన వీలునామా రాసిన తేదీ నిరూపణ అవుతుంది.
కనుక వీలునామా రిజిస్ట్రేషన్ అనేది ఐచ్ఛికం అని చెప్పాలి.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వీలునామా అయినా రిజిస్ట్రేషన్ చేయని వీలునామా లాగానే నిరూపణ చేసుకోవాలి.
కనుక వీలైతే వీలునామా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
వీలునామా ఒరిజినల్ ను మీ దగ్గర సేఫ్ కస్టడీ లో గానీ, లాకర్ లో గానీ ఉంచుకుని మీకు నమ్మకం ఉన్న వారికి ఆ విషయం తెలియచేయాలి.
అలాగే వీలునామా కాపీలను మీకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఉంచడం మంచిది.
విల్లు ప్రొబేట్ తీసుకోవాలి అని అంటూ ఉంటారు.
ప్రొబేట్ అనేది కోల్ కతా, చెన్నయ్, ముంబై (ప్రెసిడెన్సీ నగరాలు) నగరాలలో విల్లు రాసినా లేదా ఆస్తులు ఆ నగరాలలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.
దేశంలో మిగిలిన పట్టణాలలో విల్లు ప్రొబేట్ తీసుకోవడం తప్పనిసరి కాదు. అంటే అది ఐచ్ఛికం. అవసరాన్ని బట్టి, విల్లు షరతులు నిర్వహణ కష్టతరంగా ఉన్న పరిస్థితుల్లో విల్లును ప్రొబేట్ తీసుకోవచ్చును.
చివరగా
వీలునామా ఎవరికి వారు స్వదస్తూరితో లేదా టైపు చేయించుకుని రాసుకోవచ్చును.
కానీ సరైన నమూనాతో పూర్తి వివరాలతో వీలునామా రాయాలంటే దస్తావేజు లేఖరితో రాయించి, న్యాయవాదిని సంప్రదించి తయారుచేసుకుంటే మంచిది.
– పి. పి. శాస్త్రి,
అడ్వకేట్, ఏలూరు.
Discussion about this post