శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవం శనివారం సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తిపారవశ్యంతో సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన వందలాది మంది దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. కర్ణాటకలోని ముళబాగళ్ శ్రీపాదరాజ మఠాధిపతి సుజయనిధి తీర్థ స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. విశేషంగా అలంకరించిన ఇక్కడి మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా దాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ
శ్రీ పురందరదాసు 4.75 లక్షల సంకీర్తనల ద్వారా భక్తి ప్రపంచానికి విశేషమైన సేవలందించారని తెలిపారు.
అనంతరం భజనమండళ్ల సభ్యులు పలు శ్రీ పురందరదాస సంకీర్తనలు ఆలపించారు. ముందుగా గురువందనంతో ప్రారంభించి, తర్వాత “బందాలో మహాలక్ష్మి…”, “బా బా రంగ…”, “యాదవ నీ బా యదుకుల నందన…”, “సకలగ్రహఫల నీనే…” తదితర సంకీర్తనలు ఆలపించారు. ఈ సంకీర్తనలకు భజన బృందం సభ్యుల నృత్యం అలరించింది.
ఈ కార్యక్రమంలో జెఈఓ సదా భార్గవి, విజివో బాలిరెడ్డి, ఆలయ పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post