హైదరాబాద్ మహానగరం… దేశవ్యాప్తంగా ఎన్నలో లక్షల మంది ప్రజలు, ఎన్నో రాష్ట్రాలనుంచి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అంతేకాదు… విదేశాల నుండి కూడా ఎందరో ఇక్కడికి వచ్చి విద్యార్జన పేరుతో ఇక్కడే గడుపుతున్నారు.. ఇంకా ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఎందరో వున్నారు. ఇది ఒకవిశ్వనగరంగా చెప్పవచ్చు…
ఇలాంటి నగరంలో ఎన్నికల నగారా మోగితే… ఎలా వుండాలి… అందరికీ తెలియాలి. అంత గట్టిగా మోగాలి. అంటే… ఎన్నికల బరిలో వున్న అభ్యర్థులు అందరికీ తెలిసివచ్చేలా చేయాలి. అందరూ ఓటు వేసేలా చూడాలి. కానీ.. ఇప్పుడు పూర్తయిన గ్రేటర్ ఎన్నికల సమరంలో అత్యల్ప ఓటింగ్ నమోదు అయిందని ప్రజలను నిందించే ముందు.. కనీసం అందరు ఓటర్లను కలవడానికి.. అభ్యర్థులు ప్రయత్నించారా? అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
ఇంత పెద్ద నగరంలో స్థిరంగా వుండే వారు చాలా తక్కువగా వుంటారు. ఈరోజు ఈ డివిజన్ లో వున్న ఓటరు మరో రెండు రోజులకు డివిజన్ మారిపోయినా మారిపోవచ్చు. కాబట్టి… ఎవరైతే స్థిరంగా అక్కడే వుంటారో… అలాంటి అభ్యర్థులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులు ప్రచారం నిర్వహించారు. ఇది చాలా తప్పు నిర్ణయంగా చెప్పవచ్చు. ఎందుకంటే… ప్రచారం అనేది కేవలం కొందరిని మాత్రమే టార్గెట్ గా పెట్టుకుని చేయకూడదు… మన ప్రయత్నం మనం పూర్తిగా ఎంతవరకు చేశామనేది ముఖ్యం. స్థిర నివాసం లేనివారిని… గురించి పెద్దగా అభ్యర్థులు పట్టించుకోలేదు. దీంతో వారు సహజంగానే ఓటు వేసే విషయంగా దూరంగా వున్నారనే చెప్పవచ్చు.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ఏ ఓటరు ఎక్కడున్నాడు అనే విషయాన్ని పార్టీ ఏజెంటు గుర్తెరిగి, సదరు అభ్యర్ధికి ఫోన్ చేసి అతడిని పిలిచి మరీ ఓటు వేయించిన పరిస్థితులు మనకు కనిపిస్తూనే వుంటాయి. తెలియకుంటే… అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలకు పనిచేసిన పార్టీ ఏజెంట్లను కదిలించి చూడండి… పార్టీ కోసం, అభ్యర్ధికోసం వాళ్లు ఎంతగా తపన పడ్డారో తెలుస్తుంది. ఎన్నికల్లో గెలుపోటములు దైవాధీనం(?)… ఇక్కడ ఓటరే దైవం… అతడి అధీనంలోనే అంతా వుంటుంది. ఒక్కోసారి ఒక్క ఓటు తేడాతోనే విజయలక్ష్మి వేరే వారి కైవసం అయిపోతుంది. ఇది తెలిసినప్పుడు ఒక్క ఓటరును కూడా మనం వదులుకోకూడదు. ఈ చిన్న విషయాన్ని గ్రేటర్ అభ్యర్ధులు మరిచారనే చెప్పాలి.
నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో తమ డివిజన్ ఎంత వరకు అనే విషయాన్ని అభ్యర్ధులు సరిగ్గా అంచనా వేయగలగాలి… తర్వాత తమ డివిజన్ లో ఎంతమంది ఓటర్లు వున్నారు… వాళ్లు అక్కడే వున్నారా లేదా… అనేవిషయాన్ని గూర్చి కూడా విచారించాలి. తర్వాత వారిని టార్గెట్ చేసుకుని ప్రచారం ప్రారంభించాలి.
నిజానికి గ్రేటర్ మునిసిపాలిటీ పరిధిలో అందునా ఎస్. ఆర్. నగర్, అమీర్ పేట, కొండాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కార్పోరేట్ సంస్థలు, విద్యాసంస్థలు ఎక్కువగా వుంటాయి. వాటితోబాటు… పెద్ద పెద్ద భవనాలు కూడా వుంటాయి. ఆయా భవనాల్లో ఇరవై నుండి ముఫ్పై వరకూ కుటుంబాలు నివసిస్తూ వుంటాయి. వాటికి గ్రేటర్ అబ్యర్ధుల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినా… వారంతా కూడా వచ్చి ఓటు వేసేవిధంగా బరిలోని అభ్యర్ధులు తమ ప్రచారం నిర్వహించాలి.
ఒక్క బిల్డింగ్ వద్దకు వెళితే… యాభై నుండి వంద వరకు ఓటర్లు వుంటారు. వారినందరినీ పేరు పేరునా పిలిచి తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించవచ్చు. దీంతో తమ వద్దకు వచ్చిన వారికి వారు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం వుంది.
అలాగే ఎన్నికల సమయంలో… అంటే రేపు ఎన్నికలు జరుగుతాయి అనగా ఈరోజే ఓటరు స్లిప్లులను సదరు ఓటర్లకు పంపిణీ చేయాలి. మాధాపూర్, కొండాపూర్ వంటి డివిజన్ల పరిధిలో అలాంటి స్లిప్లులు ఎక్కడా ఏ బిల్డింగ్ కూ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో తమకు అసలు ఓటు వుందో లేదొో కూడా తెలియని సందిగ్ధంలో ఓటర్లు వుండిపోయారు. మరికొందరు అసలు తాము ఏ డివిజన్ కు చెందిన వారిమో కూడా తెలియని తికమకలో వుండి, ఓటు వేయకుండానే వుండిపోయారు. ఇక కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారైతే సరేసరి… అన్నీ చదువుకున్న వారై వుండి కూడా ఓటు విలువ తెలిసిన వారు అయికూడా … తమను ఎవరూ ఓటు వేయమని అడగలేదే… అనుకుంటూ… చక్కగా కంపెనీ వారు ఇచ్చిన ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని ఎంజాయ్ చేసుకున్నారే తప్ప ఓటు వేయడానికి ఉత్సాహంగా ముందుకు రాలేదు.
ఈ విధంగా అన్ని రకాలుగా గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. అయితే… అయిందేదో అయిపోయింది. ఇకనుండైనా… ఇలాంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి, ముఖ్యంగా అభ్యర్ధులు తాము గెలుపు గుర్రాన్ని అధిరోహించాలంటే… పెద్ద పెద్ద బిల్డింగ్ లనే టార్గెట్ గా పెట్టుకుని… అక్కడి ఓటర్లను ఆకర్షించారంటే…. అక్కడ పంపకాలు కూడా పెద్దగా చేయాల్సిన పని వుండదు… కాబట్టి వారిని ఆకట్టుకుంటే… విజయం మీదే కావచ్చు…మరో గ్రేటర్ ఎన్నికలకైనా అభ్యర్ధులు ఇలా ప్రచారం చేస్తే బాగుటుందేమో…!
.

Discussion about this post