ఇవాళ అమరావతి నుంచి రాజధాని తరలిపోతున్నదంటూ భారతీయ జనతా పార్టీ మరియు వారు కొత్తగా పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆగ్రహం కూడా కురిపిస్తున్నాయి. తమ పార్టీలు తలచుకుంటే.. శాశ్వత రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఏర్పాటు అవుతుందని కూడా పవన్ కల్యాణ్ అంటున్నారు. అయితే ఈ రాజధాని తరలింపు వ్యవహారాన్ని తప్పుపట్టగల నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి ఎక్కడుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి అనిశ్చితిలో కొట్టుకుంటున్నదంటే… అది వారు చేసిన ద్రోహఫలితమే కదా? అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
అమరావతి నగర శంకుస్థాపనకు ప్రధానిగా మోడీ స్వయంగా హాజరయ్యారు గానీ.. నయాపైసా విదిలించకుండా… నిధులు ప్రకటించకుండా… నీళ్లు మట్టి ఇచ్చి అంతటితో చేతులు దులుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద తనకు కనీస కన్సర్న్ ఉన్నట్టు కూడా ఆయన కనిపించలేదు.
ఏదో పగబట్టినట్టుగా ప్రత్యేకహోదా విషయంలో భాజపా మాట మార్చింది. చంద్రబాబు పాలనలోని చేతగానితనం వల్ల.. అటు ప్రత్యేకహోదా కూడా రాకుండా, వారు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని కూడా సాధించుకోలేకుండా రాష్ట్రం రెంటికి చెడ్డ రేవడి అయింది.
తాము ప్రకటించే సాయం.. రాష్ట్ర ప్రభుత్వాలతో స్నేహం మీద ఆధారపడి ఉండదని.. రాష్ట్ర ప్రజల గురించిన ఆలోచనతోనే ఉంటుందని.. ఇది ప్రజాస్వామ్యం అని నిరూపించుకునే అవకాశాన్ని మోడీ సర్కారు కోల్పోయింది. బాబు సర్కారుతో బెడిసిన తర్వాత కూడా ఏపీ కోసం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం యథాతథంగా అందజేసి ఉంటే… ప్రజలు ఆ పార్టీని నమ్మేవాళ్లు.
ఇలాంటివేమీ చేయకుండా.. ఇప్పుడు హఠాత్తుగా.. అమరావతి విషయంలో మేం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం.. అమరావతిలోనే రాజధాని ఉండేలా చూస్తాం అని ప్రకటనలు గుప్పిస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు?
Discussion about this post