చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర వేద్దామని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజక వర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ‘పుర’ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీకాళహస్తి అంటే గోపాలన్న.. గోపాలన్న అంటే శ్రీకాళహస్తి అని కొనియాడారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి హయాంలో శ్రీకాళహస్తి ఎంతో అభివృధ్ధి చెందిందన్నారు.
ఆయన హయాంలోనే ఏర్పేడు వద్ద ఐఐటీ, ఐఐఎస్ ఈఆర్ వంటి జాతీయ విద్యా సంస్థలు వచ్చాయన్నారు. రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు.
ఈ విషయం స్థానికులకు అందరికీ తెలిసిన సత్యమేనని సోమిరెడ్డి చెప్పారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అభివృద్ధికి మారుపేరు అని కొనియాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఏనాడూ అవినీతి మరకలు అంటించుకోలేదన్నారు.
అలాంటి గోపాలన్న కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వంలో శ్రీకాళహస్తిలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. సుధీర్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని అన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలనా కొనసాగుతోందన్నారు. వ్యవసాయ శాఖ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. పుర ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని సూచించారు.
తిరుపతి పార్లమెంటరీ, కుప్పం పుర ఎన్నికల్లో అధికార పార్టీ పెద్ద మొత్తంలో దొంగ ఓట్లు వేయించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శ్రీకాళహస్తి పుర ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా చూడాలన్నారు.
ఇక బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో శ్రీకాళహస్తి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆ అభివృద్ధి అజెండాగా పుర ఎన్నకల్లో దిగాలని కోరారు.
ప్రస్తుత ఎమ్మెల్మే బియ్యపు మధుసూదనరెడ్డి చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించాలని కోరారు. అధికారం లోకి రాగానే ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేనాటి సతీష్ రెడ్డి, నరసింహ యాదవ్, పెళ్లకురు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు దశరధ ఆచారి, చలపతి నాయుడు, గురవారెడ్డి, పార్లమెంట్ నాయకులు చెంచయ్య నాయుడు, కంఠ రమేష్, జిలానీ బాషా, మండల అధ్యక్షులు గాలి మురళీ నాయుడు, పొన్నారావు, ముని చంద్రా రెడ్డి, చక్రాల ఉష, ప్రసాద్ నాయుడు, ప్రకాష్ రావు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
.