భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాటలు ఆ పార్టీకి సమాధి కట్టే విధంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఎంతో సీనియర్ నేతగా పేరున్న వీర్రాజు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతోందా…? లేక తెలియక మాట్లాడుతున్నారో ఆ పార్టీ నేతలే తలలు పట్టుకునే పరిస్థతి ఏర్పడింది.
మొదట ఏదో ఒకటి మాట్లాడటం.. ఆ తరువాత తన మాటల్ని ఎవరో వక్రీకరించారని చెప్పడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. ఇటీవల చీప్ లిక్కర్ విషయంలో కానీ, తాజాగా రాయలసీమ వాసుల విషయం కానీ ఇలానే జరిగింది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. నెల రోజుల కిందట విజయవాడలో రాష్ట్ర స్థాయి ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొంతమంది కేంద్ర నాయకులు కూడా హాజరయ్యారు. ‘ఏపీలో కోటి మందికి పైగా చీప్ లిక్కర్ తాగే వారున్నారని… వీరందరూ తమ బీజేపీకి ఓట్లు వేస్తే తప్పకుండా అధికారంలోకి వచ్చి చీప్ లిక్కర్ ధర తగ్గిస్తామని’’ ఆ సమావేశంలో ప్రకటన చేశారు. ఇది అప్పట్లో బాగా వివాదాస్పదమైంది.
అయినా సోము వీర్రాజు తన మాటలను ఉప సంహరించుకోకుండా.. ‘‘కొందరు ఉద్దేశ్వ పూర్వకంగా వక్రీకరించారని’’ సమర్థించుకున్నారు. ఏపీ ప్రజలను చీప్ లిక్కర్ తాగే వారిగా వర్ణించడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆయన మాటల వలన బీజేపీకి బాగా చెడ్డపేరు వచ్చింది. ఏపీ ప్రజలు అది మరవక మునుపే సోము వీర్రాజు తాజాగా గురువారం విశాఖలో రాయలసీమ, కడప ప్రజలను ఉద్దేశించి.. ‘‘ రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు… ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాల్లో కూడా ఎయిర్ పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే వచ్చు..’’ అంటూ వ్యాఖానించారు.
ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన రాయలసీమ నేతలతో పాటు.. వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను రాయలసీమకు చెందిన సామాన్య ప్రజలు కూడా ఖండిస్తున్నారు. రాయలసీయ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని పలువురు అంటున్నారు. ‘‘కడప ప్రజలపై సోము వీర్రాజు వ్యాఖ్యలు ఒక ప్రాంత ప్రజల మనో భావాలను కించపరచడమే. ఇవి ఆయన వ్యక్తి గత విమర్శలా? పార్టీ విధానమా? వెంటనే క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుంది. సినిమాల్లో లాభాల కోసం ఫ్యాక్షన్ నచూపిస్తున్నారు’’ అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎదురు దాడికి దిగారు.
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించిన వారిలో ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా వీర్రాజు వ్యాఖ్యలను ఖండించారు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని వీరు డిమాండు చేశారు. వీరే కాకుండా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంతో మంది వీర్రాజు మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ.. ఇలా అవివేకంగా మాట్లాడటం వలన ఆ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది. సంస్కృతిని కాపాడాలని చెప్పే వారే.. ఒక ప్రాంత సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీర్రాజు ఇకనైనా తన మాట తీరు మార్చుకోక పోతే.. రాష్ట్రంలో బీజేపీకి పెద్ద నష్టమే జరుగుతుంది. ఆయన ఇలాగే ఉంటే అధిష్టానం ఆగ్రహానికి కూడా గురైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
.