చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాళెం సమీపంలో తెలుగుగంగ కాలువలో దూకి చైతన్య(19) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది.ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, గీత దంపతుల కుమార్తె చైతన్య అనే యువతి నెల్లూరు జిల్లా విద్యానగర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతూ… అక్కడే కళాశాల వసతి గృహంలో ఉండేది.
వసతిగృహంలో ఉండలేనని… చదవడం కూడా కష్టంగా ఉందని… తాను ఇంటికి వచ్చేస్తానంటూ చైతన్య తరచూ తన తల్లిదండ్రులతో చెప్పేది. అయితే వారు తమ కుమార్తెకు సర్ది చెబుతూ వచ్చేవారు.
వచ్చే ఏడాది కళాశాల మార్పు చేస్తామని కూడా చెప్పారు. అయినా ఆమె అసంతృప్తిగానే ఉండేది. ఇదిలా ఉండగా చైతన్య నూతన ఏడాదికి తన స్వగ్రామమైన కారాకొల్లుకు వచ్చింది.
శనివారం తల్లిదండ్రులకు చెప్పి శ్రీకాళహస్తికి వచ్చి శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకుంది. అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్లింది. ఆ తరువాత ఇదే మండలంలోని శివనాథపాళెం సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు వచ్చి…సెల్ ఫోన్ పక్కన పడేసి కాలువలో దూకేసింది.
ఆ నీటిలో పడి చైతన్య ప్రాణాలు వదలింది. తమ కుమార్తె ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పలుచోట్ల వెతికారు. అయినా ఫలితం లేక పోయింది.
ఆదివారం ఆమె తెలుగుగంగ కాలువలో శవమై తేలడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. చైతన్య ఆత్మహత్య చేసుకోవడంతో కారాకొల్లులో విషాదం అలుముకుంది.
.