నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండు చేశారు. అమరావతి రైతులు చేసిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహాపాదయాత్ర మంగళవారం తిరుపతి శ్రీవారి పాదాల చెంత ముగిసిన సంగతి తెలిసిందే.
అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు సుమారు 35వేల ఎకరాలు భూమి ఇచ్చారన్నారు.
టీడీపీ హయాంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారన్నారు. అధికారంలోకి రాక మునుపు అక్కడ ప్రజలను నమ్మించడానికి వైసీపీ అధినేత జగన్ అక్కడే నివాసం కూడా నిర్మించుకున్నారన్నారు. ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ నేడు మూడు రాజధానులు అంటున్నారన్నారు. ఇలా చేయడం వలన అమరావతి రైతులు పూర్తిగా నష్ట పోతారన్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని 700 రోజులకు పైగా ఆ ప్రాంత రైతులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారని… అదేవిధంగా సుమారు 450 కి.మీ. మహాపాదయాత్ర కూడా చేశారన్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవడం బాధాకరమన్నారు. అమరావతి కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని… అక్కడి రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు.
ఈ పోరాటానికి ప్రజలు కూడా మద్దతు ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతినాయుడు, చక్రాల ఉష, రెడ్డివారి గురవారెడ్డి, కంఠా రమేష్, ప్రమీలమ్మ, రేణుకమ్మ, మిన్నల రవి, ప్రకాశ్ నాయుడు. ప్రసాద్ నాయుడు, పోలూరు శ్రీనివాసులురెడ్డి, ప్రవీణ్, మస్తాన్, జిలానీ బాషా, సుబ్బయ్య, యాదగిరి, మునిరాజాయాదవ్, వేంకటేశ్వర చౌదరి, అస్మత్, తీర్థం వేంకటేశ్వర్లు, నెమళ్లూరు బుజ్జి, ఆర్ముగం, ఎం ఎస్ రెడ్డి, గుప్త తదితరులు పాల్గొన్నారు.
.