నిమజ్జనం విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. దారుణంగా అక్షింతలు వేసింది. హైకోర్టు వేసిన అక్షింతలు చాలవన్నట్లుగా.. సుప్రీం కోర్టు వద్ద కూడా అదే అక్షింతలు వేయించుకోవడమే ఉద్దేశ్యం అన్నట్లుగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఉంది!
పీఓపీతో చేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పేసింది. జీహెచ్ఎంసీ రకరకాలుగా విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఈ విషయంలో విపరీతంగా మల్లగుల్లాలు పడిన కేసీఆర్.. చివరికి సుప్రీంను ఆశ్రయించడానికే నిర్ణయించారు. హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇది బుధవారం ఉదయం విచారణ నిమిత్తం సీజే ఎదుటకు రానుంది.
అయితే.. పర్యావరణ సమతుల్యత, పరిరక్షణ, హుసేన్ సాగర్ ను విషతుల్యం చేయడానికి సంబంధించిన అంశం కావడంతో.. సుప్రీంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. హుసేన్ సాగర్ లో ఇలాంటి రసాయనాలతో కూడిన, సాగర్ కాలుష్యానికి కారణమయ్యే విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలనే అంశం ఇవాళ్టిది కాదు. కొన్నేళ్లుగా నలుగుతూనే ఉంది. ప్రతిప్రభుత్వమూ ఈ దిశగా ఎంతో కొంత కసరత్తు చేసినట్లు కనిపించడమూ.. చివరకు చేతులెత్తేసి యథోరీతిగా నిమజ్జనం అక్కడే జరగడమూ రివాజు అయిపోయింది. కానీ ఈ ఏడాది హైకోర్టు కఠినంగా వ్యవహరించడంతో తేడా కొట్టింది.
సుప్రీం కోర్టు అయినా సరే.. పర్యావరణానికి హానిచేసే నిర్ణయాన్ని సమర్థిస్తుందని అనుకోవడం భ్రమ. నిజానికి తీర్పు సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన పలు అంశాలను పరశీలించినప్పుడు.. ఆ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం తోసిపుచ్చకపోవచ్చుననే అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. ఇప్పటికిప్పుడు నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వ్యవస్థ లేక సుప్రీంను ఆశ్రయించారే తప్ప.. అక్కడ కూడా ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయమే పాలకపక్షంలోనూ వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం జగన్ కు కోర్టుల నుంచి వరుస ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కు కూడా ఒక ఎదురుదెబ్బ తప్పదనిపించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.
.