ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు సుప్రీంకోర్టు లో గురువారం చుక్కెదురైంది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టివేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు విధులను నిర్వర్తించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సైతం సస్పెన్షన్‌ను సమర్థించింది. దీనిపై సుప్రీం కోర్టు కు వెళ్లగా అక్కడ ఏబీ వెంకటేశ్వరరావు కు ఊరట లభించలేదు.
సీనియర్ అధికారి అయినందున విచారణను ప్రభావితం చేయగలరని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం లో వాదించింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన అయితే స్టే ఉత్తర్వులను తొలగించింది. దీంతో నిఘా పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారణ కొనసాగనుంది. అదే సందర్భంలో విచారణ పూర్తయ్యే వరకు ఆయన సస్పెన్షన్ లోనే ఉండే అవకాశం ఉంది.
రెండు రోజుల్లో జగన్‌కు రెండో విజయం
ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు, ఏబీ వెంకటేశ్వరరావు మీద చాలా ఫిర్యాదులు చేశారు. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. సస్పెండ్ చేయడంతో.. ఆ నిర్ణయం వివాదాస్పదం అయింది. దానికి తగ్గట్టే సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి విజయం సాధించింది.
ఒక రకంగా చూస్తే.. వరుసగా రెండోరోజున జగన్ సర్కారుకు సుప్రీం కోర్టులో ఇది రెండో విజయం అని భావించాలి. బుధవారం నాడు జగన్ అనుకూల నిర్ణయం ఒకటి సుప్రీం నుంచి వచ్చింది. అమరావతి భూకుంభకోణాలపై జరుగుతున్న విచారణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ ను సుప్రీం కొట్టివేసింది. గురువారం, జగన్ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టేను కూడా కొట్టివేసింది.
.