కైశిక ద్వాదశి అనేది అనితర సాధ్యమైన భగవద్భక్తికి మాత్రమే కాదు.. అద్భుతమైన సత్యనిరతికి నిదర్శనం గా ఉండే పర్వదినం. శ్రీవారి పట్ల తన భక్తిని చెల్లించుకోవడంలో.. ప్రాణాలను కూడా తృణంగా ఎంచిన మహనీయుడు మోక్షసిద్ధిని తెలియజెప్పే పర్వదినం కైశిక ద్వాదశి.
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మంగళవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గం.ల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశస్త్యం
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
నంబదువాన్ కథ
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు.
తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు.
భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్థానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, విజివో బాలిరెడ్డి, ఎవిఎస్వో సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post