ప్రముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలలో ఒకరైన విజయదాసరు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు.
పురందరదాసుల వారికి 5 లక్షల సంకీర్తనలు రచించాలనే సంకల్పం ఉండేదని, కానీ వయస్సు సహకరించక తన చివరి కుమారుడైన మధ్యాపతిని 25 వేల సంకీర్తనలు రచించవలసిందిగా సూచించారని చెప్పారు.
ప్రాచీనులు తెలిపిన విధంగా మధ్యాపతి పునఃజన్మిస్తారని అపర జ్ఞానులైన పురందర దాసులవారు తెలియజేశారన్నారు. దాదాపు 250 సంవత్సరాల తరువాత విజయదాసరుగా అవతరించి పూర్వజన్మ తండ్రి అయిన పురందర దాసుల ఆజ్ఞానుసారంగా 25 వేలకు పైగా భక్తి గీతాలను స్వరపరిచి శ్రీవారికి సమర్పించారన్నారు.
విజయదాసరు ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శిష్యబృందంతో వచ్చి ఉత్సవాల్లో భాగమైన సంకీర్తనలు, నర్తన సేవలు చేసి శ్రీవారిని సంతోషపెట్టేవారని వివరించారు.
ఆరాధనోత్సవాలలో భాగంగా ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 150 మంది దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు విజయదాసుల సంకీర్తనలు పారాయణం చేశారు.
అంతకుముందు బెంగూళూరుకు చెందిన ప్రముఖ కళాకారులు ఐశ్వర్య, సంధ్య, లక్ష్మీ మధూసూదన్ బృందం శ్రీ విజయదాసరు కీర్తనలను సుమధురంగా అలపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి విజయసారధి, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
.