ఆయన పేరు భాస్కర్ నాయుడు. పడగవిప్పి కోపంతో బసలు కొట్టే నాగుపామును తన చాకచక్యంతో ఇట్టే పట్టి బుట్టలో పెట్టేయగలడు. తన ఎత్తుకు రెండు మూడు రెట్లు ఉండే కొండచిలువలను.. లాఘవంగా పట్టుకుని.. బుజ్జగించి.. నలుగురికీ చిత్రంగా చూపించగలడు. అలాగని ఆయనేమీ పాముల్ని పట్టుకుని అమ్ముకునే వాడు కాదు.
జనం మధ్యలోకి పొరబాటుగా వచ్చేసి.. కంగారు పడి, జనాన్ని కూడా కంగారు పెట్టే పాములను పట్టుకుని.. జాగ్రత్తగా తీసుకెళ్లి.. వాటిని సురక్షితంగా.. వాటికి ఇష్టమైన అడవి మధ్యలో వదలిపెట్టే అలవాటు ఉన్నవాడు. ఆయనే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్నేక్ క్యాచర్ గా ఉద్యోగవిధులు నిర్వర్తిస్తున్న భాస్కర్ నాయుడు.
అలాంటి భాస్కర్ నాయుడు కొన్ని రోజుల కిందట పాముకాటుకు గురై ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందరికీ తలలో నాలుకలో ఉండే స్నేహశీలి, సుమారు పదివేల పాములు పట్టిన అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు ప్రస్తుతం పాము కాటుతో ఆస్పత్రిలో ఉండడం పలువురిని కలవరపరుస్తోంది.
ప్రస్తుతం తిరుపతి అమరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పరిస్థితి విషమంగానే ఉంది. వారం రోజుల ముందు భాస్కర్ నాయుడు పాముకాటుకు గురయ్యాడు.
ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో వైద్యులు దానికి సంబంధించి చికిత్స అందించారు. డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై భాస్కర్ నాయుడు చికిత్స పొందుతున్నారు.
భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థతిపై ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల నుండి భక్తులను రక్షిస్తున్న భాస్కర్ నాయుడు, టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ ఇప్పటి వరకు 10వేల పాములకు పైగా పట్టుకున్నాడు. వయసు రీత్యా రిటైరైనప్పటికీ టీటీడీ మాత్రం భాస్కర్ నాయుడు సేవలు కొనసాగిస్తున్నది.
అదనపు ఇఓ ధర్మారెడ్డి ఆదేశాలు మేరకు అమరా హాస్పిటల్స్ లో చికిత్స పోందుతున్న పాముల భాస్కర్ నాయుడు బర్డ్ స్పేషల్ ఆఫిసర్ డాక్టర్ రెడ్డప్పరెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తూతం భాస్కర్ నాయుడు నిలకడగా వుందని.. త్వరలోనే కోలుకుంటారని రెడెప్పరెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు.
Discussion about this post