సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై రాసిన పరిశోధనాత్మక పుస్తకం ‘బ్లడ్ సాండర్స్’ బుధవారం విడుదలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ పుస్తకాన్ని అవిష్కరించారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి ఆన్‌లైన్ లో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్లడ్ సాండర్స్’ పుస్తకం వెనక సుధాకర్ రెడ్డి పరిశోధన, కృషి ఎంతో ఉందని కొనియాడారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ న్యూస్ రిపోర్టర్‌గా ఆయన ఈ విషయాన్ని ట్రాక్ చేస్తున్నారు. నడవడానికి కష్టతరమైన అడవిలో.. ఎర్రచందనం దాచే ప్రదేశాలలో ఆయన విస్తృతంగా ప్రయాణించారు. స్మగ్లింగ్ రాకెట్ నడిపే వ్యక్తులతో, వారికి అడ్డుకట్ట వేసే అధికారులలో ఆయన ప్రత్యక్షంగా సంభాషించాడు. ఈ పుస్తకం రాయడానికి అత్యంత అర్హత కలిగిన వ్యక్తి సుధాకర్ రెడ్డి అని నేను అనుకుంటున్నానని ఎన్వీ రమణ కితాబిచ్చారు.
ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం లేనే లేదని అంటూ.. స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయాలంటే.. ఎర్ర చందనం పరిరక్షణ స్థానికుల అప్పగించాలని సూచించారు.

పుస్తక అవిష్కరణ కోసం సుధాకర్ రెడ్డి మొదట నన్ను సంప్రదించినప్పుడు.. ‘అవును’ అని చెప్పడం తప్ప నాకు వేరే మార్గం లేదు. కారణం.. అతను జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ల నుండి నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఎడిటర్ స్థాయికి ఎదిగినందుకు నేను సంతోషిస్తున్నానని ఎన్వీ రమణ అన్నారు. SVVNలో విద్యార్థులుగా ఉన్నప్పటి నుండి సుధాకర్ రెడ్డి కుటుంబంతో పరిచయం ఉందన్న ఎన్వీ రమణ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా.. మా ఊరూ వాడా గుర్తొస్తొన్నాయి. ఆ మంచి రోజులూ, ఆనాటి మిత్రులు గుర్తుకొస్తున్నారు. ఊరికి వెళ్లాలని ఎప్పటినుండో అననుకుంటున్నాను. త్వరలో వీలు చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అని సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు.
పుస్తకావిష్కరణ అనంతరం అతిథులతో చర్చాకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి ఎంవి కృష్ణారావు మాట్లాడుతూ ఎర్రచందనం చుట్టూ అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతోందన్నారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకునే దాకా ఇది ఆగదని ఆయన అన్నారు. చైనాలో రాజులు ఎర్రచందనం విరివిగా వాడేవారని, ఆ ప్రభావం వల్ల అక్కడ ధనికులు తమ గృహోపకరణాల వినియోగానికి ఎంత ఎక్కువ ఖర్చయినా వెచ్చించి దీనిని బాగా తెప్పించుకుంటారని వివరించారు. చైనా మీద అంతర్జాతీయ సమాజం ఒత్తిడితేవాలని, చైనా విధానాల్లో మార్పువస్తే తప్ప.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగే అవకాశం లేదన్నారు.
మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పనిచేసిన పి.రఘువీర్ మాట్లాడుతూ.. ఎర్రచందనం చుట్టూతా కోట్ల రూపాయల దుర్వినియోగం జరుగుతోందన్నారు.
కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ కొన్ని విలువైన సూచనలు చేశారు. రాజకీయంగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరుగుతోంది. ఇన్ని చట్టాలున్నా పట్టించుకునేవారు లేరని అంటూ.. ప్రభుత్వమే అధికారికంగా ఎర్రచందనం విక్రయించినట్లయితే ప్రభుత్వానికే పెద్ద మొత్తాల్లో డబ్బులు వస్తాయన్నారు.
బ్లడ్ సాండర్స్ పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా ఉందని పేర్కొన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన వాళ్లు దుబాయిలో హాయిగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వివరించారు. దుబాయిలో స్థిరపడిన బడా స్మగ్లర్లు ఒక్కొక్కరు 500 కోట్లు, 1000 కోట్లు రూపాయల విలువైన మాఫియా సామ్రాజ్యాలను నెలకొల్పారని చెప్పారు. ఎర్రచందనం అక్రమార్కులందరూ.. దుబాయిలో తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా దాదాపు లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం తరలిపోయి ఉంటుందని ఆయన అంచనా వేశారు.
ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ కార్యక్రమానికి సంధాన కర్తగా వ్యవహరించారు.
.

Discussion about this post