రీమేక్ చిత్రాలు చాలా రకాలుగా కత్తిమీద సాము. హిందీలో విజయవంతం అయిన.. అంధాధున్.. తెలుగులో ‘మాస్ట్రో’గా మెప్పంచేలా ఉందా? లేదా? చూద్దాం..
హిందీలో విజయవంతమైన సినిమా ” అంధాదున్” ని తెలుగు లోకి రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసి, చాలామంది ఆసక్తి గా ఎదురుచూసారు. టబు మినహా పెద్ద పెద్ద స్టార్ లు లేకపోయినా సినిమా కమర్షియల్‌గా గొప్ప విజయం సాధించడం మాత్రమే కాదు. నేషనల్ అవార్డులు గెలుచుకోవడం కూడా.. తెలుగు ప్రేక్షకులు రీమేక్ కోసం ఎదురుచూడడానికి ఒక కారణమైంది. అందులోనూ హీరో నితిన్ నటిస్తుండటం వల్ల మంచి ఊపు వచ్చింది. మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఇదివరలో వచ్చిన సినిమాల మీద పాజిటివ్ అభిప్రాయం కూడా.. ఈ సినిమా పట్ల ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచింది.
మాతృక ను ఏ మాత్రం మార్చకుండా, చక్కని నటీ నటులతో, మంచి లొకేషన్స్ లో, ఖర్చు కు వెరవకుండా, శ్రమించి తీసిన సినిమా మాస్ట్రో. క్రైమ్ థ్రిల్లర్ అయినా, చూసే ప్రేక్షకులకు ఎక్కడా కన్ఫ్యూజన్ అనిపించదు. నితిన్, తమన్నా, నరేష్… వీరంతా చాలా చక్కగా నటించారు. సందర్భానుసారం వచ్చే మూడు పాటలు బావున్నాయి.
అయితే ఈ సినిమా లో ప్రధాన లోపం ఏమిటంటే, తెలుగు నేటివిటీ లోపించడం. పాత్రలు తెలుగులో మాట్లాడుకుంటాయి తప్పితే తెలుగు వాతావరణం ఎక్కడా ఉండదు. సినిమాకు తగినట్లుగా అత్యంత మాడర్న్ కల్చర్ ను చూపించదలచుకుంటే గనుక.. నగర జీవనాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఉండవచ్చు. అయితే సినిమాను గోవాకు తీసుకువెళ్లారు. గోవా లో చక్కగా చిత్రీకరించినా, గోవా అందాలన్నీ గొప్పగానే సెల్యులాయిడ్ మీద కనువిందు చేసినా.. సినిమాకు మూలమైన ఎలిమెంట్ క్రైమ్ కావడం వల్ల ఆ అందాలు ప్లస్ అవలేదు.
అందమైన నటి తమన్నా చక్కగా నటించినా, ఆ కేరక్టర్ కి ఆమె సూట్ అయినట్లు అనిపించదు. సెకండ్ హాఫ్ మధ్య లోకి వచ్చే సరికి సినిమా మీద ఆసక్తి పోతుంది. హీరో. నితిన్ పాత్ర కు ఒక ఆర్క్ లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన బలహీనత. మహతి సాగర్ నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. అయితే గత కాలపు హీరో గా నరేష్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.
టోటల్ గా చూసినప్పుడు ‘మాస్ట్రో’ సినిమా నిరాశ పరిచిందనే చెప్పాలి. అంధాధున్ చూసి, ఆ ఫీల్‌ను ‘మాస్ట్రో’లో కూడా వెతుక్కోవాలంటే కష్టమే. అలాకాకుండా.. స్ట్రెయిట్ గా తెలుగులోనే ఈ చిత్రాన్ని చూసే వారికి కూడా చిత్రం పరవాలేదని అనిపిస్తుంది.
ఓటీటీ వేదికపై విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. థియేట్రికల్ రిలీజ్ అయితే చేదు ఫలితాలను చవిచూసి ఉండేది.
మాతృక తో హిందీ ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయి నట్లు, మాస్ట్రో తో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేరు. హీరో నితిన్ చక్కగా నటించడం ఒక్కటే మాస్ట్రో కు హైలైట్.

.
Discussion about this post