శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కళాశాల రాజకీయ చదరంగంలో చిక్కుకుంది. కళాశాలకు ప్రిన్సిపాల్ లేరు. మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి కలిపి 70మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ఒకే ఒక బోధకురాలు. ఆమె కూడా డైలీ వేజ్ కింద పని చేస్తోంది. ఆరు మాసాలుగా ఇదే పరిస్థితి. ఈ విషయం అధికారులకు తెలిసినా.. పట్టించుకోక పోవడం వెనుక రాజకీయ కారణాలనే బలమైన ప్రచారం జరుగుతోంది.
ముక్కంటి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తిలో చాలా కాలంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ప్రస్తుతం మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించి 70మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. గతంలో ఈ కళాశాల కాసాగార్డెన్ లో నిర్వహించేవారు. అయితే ఈ కళాశాలను నాలుగేళ్ల కిందట స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోనికి మార్చారు. అప్పటి నుంచి ఈ కళాశాల ఇక్కడే నిర్వహిస్తున్నారు.
మొదటి నుంచి నర్సింగ్ కళాశాలకు ఎంతో మంచి పేరుంది. చదువులు కూడా బాగున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థుల్లో ఎక్కువ భాగం పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. దేవునికి సంబంధిబంచిన కళాశాల కావడంతో ఇక్కడ చదువు కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఇలాంటి కళాశాల భవితవ్యం నేడు రాజకీయ కారణాలతో అంధకారంలోకి నెట్టబడుతోంది. ఈ కళాశాలకు ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న శ్యామలను ముక్కంటి లయ అధికారులు రెన్యువల్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె బాధ్యతల నుంచి తప్పు కోవాల్సి వచ్ఛింది. అప్పటి నుంచి అంటే ఆరు మాసాలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. శ్యామలను రెన్యువల్ చేయకుండా.. లేదంటే ఆ పోస్టులో ఇతరులను నియమించ కుండా ముక్కంటి ఆలయ అధికారులు జాప్యం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్యామల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్నపుడే కళాశాలలో టీచింగ్ స్టాఫ్ నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఇది జరిగి సుమారు పది నెలలు దాటింది. అయినా సిబ్బందిని నియమించ లేదు. ఇందుకు రాజకీయాలే కారణమనే బలమైన ఆరోపణ ఉంది. టీచింగ్ స్టాఫ్ ను నియమించక పోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు బోధించడానికి ఒకే ఒక్కరు ఉన్నారు. విద్యార్థులను క్యాంపులు, ఆస్పత్రి విధులకు తీసుకు పోవడానికి సిబ్బంది లేక పోవడంతో… ఉన్న ఒక్కరే వెంట పోవాల్సి వస్తోంది. ఇలా వెళ్లినపుడు తరగతుల్లో ఉన్న విద్యార్థులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం ముక్కంటి ఆలయ అధికారులకూ తెలుసు. అయినా టీచింగ్ స్టాఫ్ నియమించదానికి పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బోధన సిబ్బంది నియమించకుండా.. ఆలయంలో ఏఈవోగా పని చేస్తున్న హేమమాలినిని పరిపాలన వ్యవహారాల కోసం ఇన్ ఛార్జిగా నియమించారు. ఆమె కేవలం విద్యార్థుల బాగోగులు మాత్రమే చూస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్ట పోతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే బోధన సిబ్బంది, ప్రిన్సిపాల్ నియామకం చేపట్టడం లేదనే ఆరోపణ ఉంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బోధన సిబ్బందిని, ప్రిన్సిపాల్ ను వెంటనే నియమించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముక్కంటి ఆలయ అధికారులపై ఉంది. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి జోక్యం చేసుకుంటే ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఆయన వెంటనే స్పందించాల్సి ఉంది.
.