ఆర్జీవీ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సరే.. యూట్యూబ్ లో వ్యూస్ లక్షల్లో ఉంటాయి. ఆయనకు ప్రజల్లో అపరిమితమైన క్రేజ్ ఉందని అందరికీ ఒక నమ్మకం. ఆర్జీవీ స్వయంగా తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిపోతున్నా సరే.. ఆయనకు క్రేజ్ ఉన్నదనే అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే.. ఆర్జీవీ క్రేజ్ మీద ఆధారపడి.. ఆయన చుట్టూ అల్లిన కథతో ఇప్పుడు మరో సినిమా తయారవుతోంది. ‘ది బాస్- నెవర్ డైస్’ అనేది సినిమా టైటిల్.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే ఏం జరుగుతుంది అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా తయారవుతున్న సినిమా ఇది. గతంలో కూడా ఆర్జీవీ పాత్రలో చేసి ఆయననే మెప్పిపంచిన షకలక శంకర్ ఇందులో కూడా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది బాస్-నెవర్ డైస్’ టైటిల్ లోగోను నటుడు సునీల్ విడుదల చేశారు.
ఈ చిత్రం సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని.. రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం “ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
.

Discussion about this post