చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ రాజకీయ పార్టీకి చెందిన దౌర్జన్యాలు ఎక్కువై పోయాయి. నేతల అండ చూసుకుని కింది స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు.
అక్రమాలు అడ్డుకోవడానికి ప్రయత్నించే ప్రభుత్వ ఉద్యోగులపై డాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయం నేతలకు తెలిసినా… బాధ్యులను కనీసం మందలించక పోవడం… వారిపై చర్యలకు ఆదేశించ పోవడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇలాంటి సంఘటన రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ పథకం కింద శ్రీకాళహస్తి పట్టణ శివారులో సుమారు 295 ఎకరాలు సేకరించి… సుమారు 7వేల మంది ఇంటి పట్టాలు మంజూరు చేశారు.
అప్పట్లో ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో 2,500కు పైగా బోగస్ పట్టాలు ఉన్నట్లు తేలింది. ఈ పట్టాలను రద్దు చేసి… ఈ స్థలాలను రెవిన్యూశాఖ ఆధీనంలో ఉంచుకుంది.
పట్టా ఉంటే తప్ప రాజీవ్ నగర్ లో ఇళ్ల నిర్మాణం చేయకూడదని శ్రీకాళహస్తి తహసీల్దారు ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దారు ఆదేశాల మేరకు వీఆర్వోలు ఈ స్థలాలను పరిశీలిస్తూ… అక్రమ కట్టడాలు నిర్మాణం చేయకుండా చూస్తున్నారు.
అయితే ఇటీవల కాలంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రాజీవ్ నగర్ లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి వివిధ రంగాలకు చెందిన వారు కూడా సహకరిస్తూ… సందులో సడేమియా అన్నట్లు వారు కూడా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
ఇది పెద్ద వ్యాపారంగా మారడంతో రెవిన్యూశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆక్రమణలు జరగకుండా చూడాలని క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఓ వీఆర్వో రెండు రోజుల కిందట రాజీవ్ నగర్ లో పర్యటిస్తుండగా… అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్లు గుర్తించారు.
అక్కడకు వెళ్లి నిర్మాణం చేపట్ట వద్దని వారిని ఆదేశించారు. అలాగే నిర్మాణం చేస్తుండటంతో సదరు వీఆర్వో అడ్డుకున్నారు. ఇందుకు ఆగ్రహించిన ముఠా సభ్యుల్లో ఒకరు వీఆర్వో పై దాడికి దిగాడు. తననే అడ్డుకుంటావా అంటూ ఆయనపై చేయి చేసుకున్నాడు.
ఇంతలో అక్కడే ఉన్న కొంతమంది దాడి చేసిన వ్యక్తిని అడ్డుకున్నారు. దాడి చేయడం మంచి పద్దతి కాదని వారించారు. ఆ తరువాత వీఆర్వో అక్కడ నుంచి వచ్చేశారు. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించారు. అయితే దాడి చేసిన వ్యక్తికి రాజకీమ అండ ఉండటంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలిసింది. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన రెవిన్యూ అధికారులు రాజీవ్ నగర్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే శనివారం కొన్ని ఆక్రమణలు తొలగించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ పార్టీలకు చెందిన వారు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా అయితే తాము విధులు ఎలా నిర్వహించాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
.