జనసేనాని పవన్ కల్యాణ్ ఆశయాలు చాలా ఉదాత్తంగా ఉంటాయి. విశాల దృక్ఫథంతోనూ ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటిలో సఫలం అయ్యేవి ఎన్ని? ప్రాక్టికల్ దృక్ఫథంతోనే ఆయన ప్రతి ఆలోచన ముందుకు తీసుకెళుతున్నారా.. లేదా అనేది ఇక్కడ కీలకం.
కర్నూలు జిల్లాకు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఆయన స్ఫూర్తి అందాలని అంటున్నారు. ఇది అందరూ సంతోషించదగ్గ విషయమే. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కర్నూలు జిల్లా కల్లూరు పరిధి పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య ఇంటిని మంగళవారం పరిశీలించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.. సంజీవయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
సంజీవయ్య నిజాయితీని దేశం నలుమూలలా చాటి చెప్పాలనే కాంక్షతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సంజీవయ్య శత జయంతి సందర్భంగా స్మారక మందిరం ఏర్పాటుకు రూ.కోటి విరాళం ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. పవన్ మనసులోని మాటను కూడా ఈ సందర్భంగా సంజీవయ్య కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు.
మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య స్ఫూర్తిని పవన్ కల్యాణ్ యావత్ దేశానికి నింపుతారని చెప్పడం మాత్రం కొంచెం అతిశయంగా ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్.. దేశ వ్యాప్తంగా తన సినిమానే విడుదల చేయలేరు. అలాంటపుడు ఈ నిస్వార్థ దళిత నేత స్పూర్తిని దేశమంతటా ఎలా తీసుకు పోతారన్నదే ప్రజల్లో మెదలుతున్న సందేహం. దామోదరం సంజీవయ్య తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితులు. ఆయన నిస్వార్థ సేవ అందరికీ తెలుసు.
ఈయన ఆశయాలను దేశ ప్రజలకు తెలియ చేయాలని పవన్ కల్యాణ్ సంకల్పించడం నిజంగానే ఆనందదాయకం. అయితే నేటి దేశ రాజకీయ పరిస్థితుల్లో ఇది ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ప్రత్యేకంగా ఉత్తర భారతంలో ఇది మరింత కష్టం. జనసేనను ఏపీ లోనే బలపరచు కోవడానికి పవన్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు సినియా అభిమానులు బాగానే ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే సరికి అభిమానులు తమ అభిప్రాయం మార్చుకుంటున్నారు.
ఓటింగ్ శాతం కూడా జనసేనకు తగిన స్థాయిలో లేదు. ఇందుకు 2019లో జరిగిన సాధారణ ఎన్నికలే నిదర్శనం. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జనసేన ఎక్కడా తన బలం నిరూపించకోలేక పోయింది. కాపులందరూ జనసేనకు అండగా నిలుస్తారని ఆ పార్టీ నేతలు ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆవిరి అయ్యాయి. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న కోస్తా ప్రాంతంలో కూడా జనసేనకు ప్రతికూల ఫలితాలు రావడం ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో దళిత సామాజిక వర్గాన్ని తన దరికి చేర్చుకుంటే బాగుంటుందనే ఆలోచన పవన్ కు వచ్చి ఉండవచ్చు. ఈ ఆలోచన వెనుక బీజేపీ ప్రోత్సాహం కూడా ఉండొచ్చు. ఏపీలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా బీజేపీకి దళిత సామాజిక వర్గం మద్దతు చాలా తక్కువ. ఈ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా బలం పెంచుకోవడానికి బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బీజేపీతో అంటకాగుతున్న పవన్ కల్యాణ్ ను ఇందుకు పావుగా వినియోగించుకోవడానికి పథకం రచించి ఉండవచ్చు. బీజేపీ అండలేక పోతే మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆశయాలను దేశ వ్యాప్తంగా పవన్ ఒక్కరే తీసుకు పోవడం చాలా కష్టం. అందులో భాగంగానే నాదెండ్ల మనోహర్ ను ముందుగా కర్నూలు జిల్లాలోని దామోదరం సంజీవయ్య స్వగ్రామానికి పంపి ఉండవచ్చనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఏ స్వార్థం లేకుండా సంజీవయ్య ఆశయాలను పవన్ దేశ వ్యాప్తంగా తీసుకెళ్తే.. దళిత సామాజిక వర్గంలతో పాటు తెలుగు ప్రజలందరూ హర్షిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పవన్ తన ఆశయం నెరవేర్చుకోవడంలో ఎంత వరకు సఫలం అవుతారన్నదే అందరిలో మెదలుతున్న ప్రశ్న. జనసేనాని ఆశయం నెరవేరాలని అందరం ఆశిద్దాం.
.

Discussion about this post