చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్ద ఓ కారు అతివేగంగా వచ్చి భక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హైదరాబాదుకు చెందిన ఇద్దరు భక్తులు గాయపడ్డారు.
వీరికి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి… అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన 12 మంది భక్తుల బృందం ఆలయాల సందర్శనకు వచ్చారు. మొదట వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకోవడానికి శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తికి విచ్చేశారు.
స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం బయటకు వచ్చారు. ఈ భక్త బృందం ముక్కంటి ఆలయ నాలుగవ గేటు వద్ద ఉండగా ఓ కారు వేగంగా భక్తుల పైకి వచ్చింది. ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా రావుళ్ల గ్రామానికి నరసింహ (60), పద్మ (52) అనే దంపతులు గాయపడ్డారు.
నరసింహకు తలకు గాయం కాగా… పద్మకు కాళ్లకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు.
కాగా ప్రమాదానికి గురైన వాహనం స్థానికంగా ఉన్న ఓ వ్యక్తిదని చెబుతున్నారు. ఈ ఘటనపై ఇంతవరకు పోలీసు కేసు నమోదు కాలేదు. తమకు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులు తెలియచేశారు.
ముక్కంటి ఆలయ ప్రాంగణంలో కారును అతివేగంగా నడిపి భక్తులను ఢీ కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
.