పార్వతీ తనయుడు పదిరోజుల నుండి మనతో ఇంట్లో పిల్లాడిలా కలిసిపోయి, మనం పెట్డేవన్ని తిని మనం చూపించేవన్ని చూసి, వినిపించేవన్ని విని, తనతో పాటు అనింద్యుడికి కూడా భాగం ఇచ్చి సేవలందుకుంటున్నాడు. అమ్మ, నాన్నలిద్దరూ ఇంక చాలు నాన్నా వచ్చేసేయి అనగానే గణపతి బప్పా మోరియా అంటున్న భక్తుల సందడిలో ఎలుక వాహనంతోటే పెద్ద పెద్ద చమురు వాహనాలెక్కిన గణపతిని చూసి అనింద్యుడు అడిగాడు,
“స్వామి! మనల్ని ఎక్కడికి సాగనంపుతున్నారు”
“ఏమో ఏదైనా పవిత్రనదీజలాల్లో మనల్ని కలుపుతారేమో? అమ్మ చాలా జాగ్రత్తగా రమ్మంది. నువ్వు జాగ్రత్తగా కూర్చో. అటూ ఇటూ తిరక్కు ఈ పదిరోజులు బాగా ఎంజాయ్ చేసావు. ఇక పనిలో పడాలి.’’
‘‘..’’
‘‘ఈ పదిరోజులు నేను భూలోకం లో ఉండిపోబట్టి గణాలన్ని ఖాళీగా ఉండిపోయి పనిపూర్తిగా మర్చిపోయుంటాయి. త్వరగా వెళ్ళాలి. ఏమిటో ఈ డప్పులు, డాన్సులొకటి అడ్డంగా మనల్ని త్వరగా వెళ్ళనీయకుండా” విచారంగా మొహం పెట్టారు స్వామి.
“పదిరోజులు నా శూర్పకర్ణాలు బ్రద్దలయిపోయేలా రణగొణధ్వనులతో పాటలు పెట్టారు. అసలు మధ్యలోనే ఇంటికి పోదామనుకున్నాను. కాని కొంతమంది చంటాళ్ళు భక్తిగా నన్ను కొలిచి పదిరోజులు పూజలుచేసి గుంజీలు తీస్తూ నన్ను ఆనందింప చేసారు అందుకని ఉండిపోయా!”
“అవును ప్రభూ! కొందరు భక్తులమని చెప్పుకునే ప్రజల భక్తి కూడా ఆర్భాటంగా తయారవుతోంది రోజురోజుకి! నా బొమ్మ పెద్దది, నా బొమ్మ ఇంకా పెద్దది అంటూ పెద్ద విగ్రహాలు పెట్టడం తప్ప ఆ పెద్దతనాన్ని తమ భక్తిలో చూపడం లేదు స్వామి!”
“అవును అన్ను! (అనింద్యుడు) నేనూ గమనించాను. నన్ను రకరకాల విచిత్ర వేషధారణల్లో చూపిస్తున్నారు. నా ఆకారాలు, విచిత్ర రూపాలు చూసి పైనున్న మన భృంగి, శృంగి, నంది, తదితర దేవతలు నవ్వుకుంటున్నారేమో అని, అమ్మ నాన్న బాధ పడతారేమోనని బెంగగా ఉంది అన్ను!
అదీకాక ఈ మధ్య నాకు కొత్త కొత్త నైవేద్యాలు అవేవో త్రిభుజాకారంగా ఉండి లోపల అదేదో కూర తో కూడినది పెడుతున్నారు. అవేంటి అన్ను! “?
“వాటిని సమోసాలంటారు స్వామి! మా సంతతి భూమిమీద తిరుగాడుతూ ఎక్కడ పడితే అక్కడ అవే తిని బ్రతికేస్తున్నాయట. నాతో మొన్న కలిసినపుడు అంటూంటే విన్నాను”.
“ఓహో! అందుకనే నా కడుపంతా ఉబ్బరించిపోయింది. ఇంటికెళ్ళాక అమ్మ చేత్తో కాస్త వాము శొంఠి తిని, దిష్టికూడా తీయుంచుకోవాలి”.
“స్వామీ ఇది చూసారా! మన ఊరేగింపులో జనం సురాపానం లాంటిదేదో త్రాగి గంతులేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్దున్నారు.
మీ పట్ల ఎంత అపచారం చేస్తున్నారో?’’ …అని కోపంగా కోరలు బయటకు చాపి గుర్రుమని కాలు దువ్వాడు అనింద్యుడు.
వారించిన గణపతి-
“ఎందుకు ఉద్రేకపడతావు మూషికా!? ఈ సారికి క్షమించి వదిలేసి వచ్చే ఏడాది చూద్దాం ! శాంతించు! శాంతించు అన్ను! ”
“మీరంతే స్వామి! గౌరీమాతలా మీకూ సహనం ఎక్కువ! కొన్నాళ్ళుపోతే మానవులు మనకి సురాపానం నైవేద్యం పెట్టేస్తారు అసురుల్లా”!
“ఊరుకుందూ! అందరు అలాంటి వారు కాదుగా! కొందరి కోసం మన సహనం, ప్రేమ! తప్పదు మరి! కలియుగం ఇది!
గంగ వచ్చిందా మూషికా?”
“లేదు స్వామీ! ఏదో నల్లమడ్డిలాంటి తెట్టులాంటి జలములో కనబడుతోంది. ఛీ! స్వామీ! ఏదో దుర్గంధం ! మీరుండండి నేను చూచి వచ్చెదను.’’
“ప్రభూ! ఈ మానవుల బుధ్ధి మరీ మందగించినది మనల్ని వైతరణీ నదములో ముంచుతున్నారు! త్వరపడండి! మనం దొరకొద్దు ఆ మూర్ఖమానవులకి!’’ అంటూ అంతర్థానమయ్యారు!
నిర్జల నిమజ్జనమయ్యారు.
స్వామీ! మా తప్పులు మన్నించి మాకు బుధ్ధి వచ్చేలా చేసి వచ్చే వినాయక చవితికి వేంచేయి స్వామీ!
..చాగంటి ప్రసాద్
.