జీవితాంతం కలసి మెలసి ఉందామని బాస చేసిన మంచి ఆప్త మిత్రుని కోల్పోయామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో జరిగిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంతిమ యాత్రలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
చంద్రబాబు స్వయంగా బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి స్వగృహంలో ఆయన సతీమణి బొజ్జల బృందమ్మతో పాటు… వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బొజ్జల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆయన వారసత్వాన్ని… ఆశయాలను కొనసాగించాలని వారికి సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తనకు ఎంతో మంచి ఆప్తుడన్నారు. అలాంటి ఆప్తుని కోల్పోవడం తనకు ఎంతో బాధగా ఉందన్నారు. తాను ఏది చెప్పినా మనసా… వాచా గౌరవించేవారన్నారు.
తనను ఎవరైనా విమర్శించినా.. ఏకవచనంతో సంభోదించినా వెంటనే స్పందించే వారన్నారు. ఇటీవల హైదరాబాదులో బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి జన్మదిన వేడుకలకు కూడా తాను హాజరయ్యానని.. అపుడు కూడా ఎంతో ఉల్లాసంగా ఉన్న బొజ్జల ఆకస్మికంగా మరణిచండం తనను కలచి వేచిందన్నారు.
నేనంటే ఆయన ఏదో తెలియని అప్యాయత చూపించే వారన్నారు. అలాంటి మంచి వ్యక్తి మన మధ్య లేక పోవడం బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
.