అజాత శత్రువు అంతిమ వీడ్కోలు అశ్రునయనాల మధ్య జరిగింది. తనకు అత్యంత ఆప్తమిత్రుని పాడెను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు స్వయంగా మోసారు. ఆత్మబంధువు చివరి చూపు కోసం అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నేత.. అభివృద్ధి ప్రదాత అనంతలోకాలకు వెళ్లడంతో ఊరందూరు కన్నీటి సంద్రమైంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి ఈ నెల 6వ తేదీ అనారోగ్యంతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం సుమారు 11.30 గంటలకు శ్రీకాళహస్తికి తీసుకువచ్చారు. మొదట శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
అక్కడకు అభిమానులు వందలాదిగా తరలి వచ్చి నివాళులు అర్పించారు. అదే రోజు మధ్యాహ్నం 1గంటకు బొజ్జల పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. బొజ్జల చివరి చూపు కోసం ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలివచ్చారు. ఇక తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల నుంచి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి నివాళులు అర్పించారు.
అమెరికా నుంచి బంధువులు వచ్చిన తరువాత ఆదివారం ఉదయం అంత్యక్రియలు పూర్తి చేశారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంతియ యాత్రలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఊరందూరుకు వచ్చారు. విద్యార్థి దశ నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వారసత్వాన్ని… ఆశయాలను కొనసాగించాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి సూచించారు. ఆ తరువాత జరిగిన బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని.. చంద్రబాబు నాయుడు స్వయంగా పాడె మోశారు.
బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పార్థివ దేహాన్ని ఊరందూరు-శ్రీకాళహస్తి మార్గంలోని వారి సొంత భూమిలో ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఖననం చేశారు. ఈ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత చంద్రబాబు మళ్లీ ఊరందూరులోని బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బొజ్జల అంతిమ యాత్రకు పలువురు ప్రముఖులు హాజరు
రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంతిమయాత్రకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఊరందూరుకు వచ్చి నివాళులు అర్పించారు. ఇక మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, అమరనాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పరసా రత్నం, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నేతలు గాలి భానుప్రకాశ్, నరసింహయాదవ్, శ్రీధర్ వర్మ, రవి నాయుడుతో పాటు… స్థానిక నేతలు తాటిపపర్తి ఈశ్వరరెడ్డి, చెలికం పాపిరెడ్డి, విజయకుమార్ నాయుడు, చెంచయ్యనాయుడు, తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి, గాలి చలపతి నాయుడు, రాంబాబునాయుడు, కామేష్ యాదవ్, గాలి మురళీనాయుడు, పొన్నారావు, చక్రాల ఉష, దశరథాచారి, ప్రకాశ్ నాయుడు, కంఠా రమేష్, షాకీరాలీ, అస్మత్, మస్తాన్, జిలానీ బాషా, రేణుకమ్మ, ప్రమీలమ్మతో పాటు పలువురు హాజరయ్యారు.
కన్నీటి సంద్రమైన ఊరందూరు
అజాత శత్రువు… అభివృద్ధి ప్రదాత… అభిమాన నేత అనంత లోకాలకు తరలి వెళ్లడంతో ఊరందూరు కన్నీటి సంద్రమైంది. చిన్న… పెద్ద తేడా లేకుండా అందరూ దుఃఖ సాగరంలో మునిగి పోయారు. ఇలాంటి నేత ఇకపై మనకు దొరుకుతారా అంటూ జనమంతా భోరున విలపించారు. ఇక బొజ్జల అంతియ యాత్రలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మడలాల నుంచి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. కన్నీటితో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు.
అధికార లాంఛనాలతో..
మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగింది. తిరుపతి కలెక్టరు వెంకట్రమణారెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ఆర్డీవో హరిత దగ్గరుండి ఈ లాంఛనాలు పూర్తి చేశారు. పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపి వందనం సమర్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందం వచ్చింది.
Discussion about this post