OTS రద్దు చేయాలని చంద్రగిరిలో టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఓటిఎస్ పథకాన్ని అంగీకరించకపోతే పెన్షన్లు తొలగిస్తామని, రేషన్ కార్డులు తీసేస్తామని వాలంటీర్లతో బెదిరించి మరీ పేదలనుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారని మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు ఆరోపించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని సూచనలతో చంద్రగిరిలో OTS రద్దు చేయాలని ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు.
టవర్ క్లాక్ వద్ద నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో నందమూరి తారకరామారావు 1983లో తొలిసారిగా పక్కాగృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు.
అప్పటినుంచి ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ, సహకారాలు అందిస్తూ వచ్చారన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో పేదలనుంచి రుణబకాయిలు వసూలుకు 10 నుంచి 40వేల రుపాయల వరకు చెల్లించాలని వత్తిడి తెస్తున్నారని అన్నారు. 1983 నుంచి 2011 వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణబకాయిలు ఇప్పుడు వన్ టైమ్ సెటిల్ మెంట్ చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు.
పలు ప్రాంతాల్లో ఓటిఎస్ పథకాన్ని అంగీకరించకపోతే పెన్షన్లు తొలగిస్తామని, రేషన్ కార్డులు తీసేస్తామని, పథకాలు కట్ అవుతాయని వాలంటీర్లతో బెదిరించి మరీ పేదలనుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
.