ఆ వటువు ఆకాశమిచ్చిన ఛత్రమే ఆఛ్చాదనంగా, బృహస్పతిచ్చిన యజ్ఞోపవీతాన్ని ధరించి, చంద్రుడు చేతులో ఉండే మోదుగ కొమ్మని దండముగా స్వీకరించి తండ్రిచ్చిన ముంజెగడ్డి మొలతాడు, అమ్మ అదితి ఇచ్చిన కౌపీనాన్ని ధరించి, బ్రహ్మగారిచ్చిన కమండలాన్ని చేతబూని, సరస్వతీదేవిచ్చిన అక్షమాలని హస్తమందుంచుకొని, వడివడిగా బుడిబుడి అడుగుల వటువు సహస్రసూర్యకాంతులతో వెలిగిపోతు బలిచక్రవర్తి యాగశాలకి వేంచేశాడు స్వామి.

అంబరం ఆనందంతో “సప్తవర్ణాల” ముగ్గులేసుకుంది.
మేఘమాలికలు వైజయంతీ మాలలుగా ఏర్పడ్డాయి.
వరుణుడు నవరత్నఖచితమైన కలశంలో ఆవరించుకొని ఉన్నాడు.
బ్రహ్మాది దేవతలు అంజలిఘటించి పారిజాతాది పుష్పాలతో సిథ్థమై ఉన్నారు దివిలో “భువి అంతా” వటుడి ఆగమనానికి ఆహ్వానం పలుకుతూ ఆయన పాదపద్మాలకి తనమేనుని సాలిగ్రామశిలగా మార్చి మృదువుగా మారిపోయింది.
వామనావతారుడైన శ్రీమన్నారాయణుడు బలి భక్తికి మెచ్చినా తను చేయవలసిన కర్తవ్యంలో భాగంగా అడ్డుకున్న శుక్రునికి “ఏకనేత్రదర్శనమే” కలిగించి వామనుడు ఒకటి లేదా రెండడుగులు దానమడుగగా మొదటిపాదం మోపగానే అవని పులకరించి పోగా, నదీనదములు సాగరములు ఆయన పాదములను అభిషేకించడానికి ప్రయత్నించగా భూమండలం అల్లకల్లోలమవుతుందని ఇది సమయంకాదని మిన్నకున్నాయి.
స్వామి పాదము ఎత్తగానే పాదము అడుగున ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి లాంటి దివ్యచిహ్నములు కాంచిన
బలి పరవశమై పోయి బంగారు కంకణాలుధరించిన వామనుని హస్తమునందు తోయాన్ని ధారపోస్తూ ఏమి నా భాగ్యం అనుకొని, “తుభ్యమహం”అనగానే మొదటి అడుగు దానం పూర్తయింది.
రెండవపాదం మోపడానికి సంసిద్ధుడైన వామనుడు ఇంతింతై, వటుడింతై, మఱియుదానింతై..
నభోవీథికేగిన హరిపాదము పై వరుణుడు అభిషేకించడానికి ప్రయత్నించగా మేఘమాలికలు వైజయంతీ మాలలు సమర్పించడానికి పరుగిడరాగా బ్రహ్మాది దేవతల పారిజాతములను తేగా, స్వామి పాదపద్మము వాళ్ళకి ఎక్కడ దొరికింది? సూర్యమండలం దాటి స్వామి పాదం సమస్త లోకాలని దాటేసింది.
సూర్యబింబమే స్వామి పాద పీఠయైనది. భూనభో మండలాల్లో స్వామి తప్ప ఏమీలేదు. అంతా “విష్ణుమయమే”.
అదిగాంచిన దేవతలందరు సంభ్రమాశ్చర్యాలకు గురియై స్తుతిపాటవాలతో అంజలి ఘటించారు.
“మూడవ అడుగుకు” మడుగులొత్తుతున్న బలి దంపతులు దానమివ్వడానికి ప్రణమిల్లారు.
బ్రహ్మకడిగిన హరి పాదస్పర్శకి బలి తల పునీతమై ఆ పారవశ్యంలో ఉండగా, స్వామి బలిచక్రవర్తి భక్తికి, శరణాగతికి మెచ్చి సావర్ణ మనువు కాలంలో దేవేంద్ర పదవి కలుగుతుందని వరమీయగ బలి ధన్యుడయ్యాడు.
శ్రీ మహావిష్ణువు ని పుత్రునిగా కన్న కశ్యపుడు, అదితి ఆ విశ్వరూపాన్ని కని ధన్యులయ్యారు.
బ్రహ్మగారు కమండలంలోని గంగతో మరల స్వామి పాదాలకడుగగా అది గాంచిన దేవతలందరు ధన్యులయ్యారు.
దేవతలు పూలవర్షం కురిపించారు. దేవదుంధుభులు మ్రోగాయి.
మనమందరం కూడా ధన్యులమవుదుము గాక!
.