ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అనుకూలంగా ప్రకటనల్లో నటించిన పలువురు సెలబ్రిటీలకు చెన్నై హైకోర్టు నోటీసులు పంపింది. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, తమన్నా, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, సుదీప్ లకు నోటీసులు హైకోర్టు పంపింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ప్రముఖులు ప్రచారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ కోర్టులో దాఖలైన పిటిషన్ పై స్పందించిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఈ విధంగా నోటీసులు జారీచేసింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త సూర్యప్రకాశన్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కోహ్లి, తమన్నాలను కూడా ప్రాసిక్యూట్ చేయాలని పిటిషనర్ కోరారు.
మద్యపానం, సిగరెట్ కన్నా ఆన్ లైన్ బెట్టింగ్ మరింత ప్రమాదకరం అని పిటిషనర్ సూర్యప్రకాశన్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఛీఛీ అంటున్న నెటిజన్లు
డబ్బు కోసం సెలబ్రిటీలు సమాజాన్ని కలుషితం చేసే ఇలాంటి ప్రకటనల్లో నటించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తమ తమ రంగాల్లో ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నప్పటికీ.. సమాజాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి పనులకు దిగడం హేయం అని పలువురు పేర్కొంటున్నారు. సమాజం పట్ల తమకు బాధ్యత ఉందనే సంగతిని వారు గుర్తించాలని అంటున్నారు.
కోర్టు నోటీసులకు స్పందించడం, సమాధానం చెప్పడం సెలబ్రిటీలకు ఎటూ తప్పదు. కాకపోతే.. ఇక మీదట ఇలాంటి డబ్బు కక్కుర్తి ప్రకటనలకు దిగజారకుండా ఉంటే వారికి గౌరవం మిగులుతుంది.
.