శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా 2004 నుండి ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన కూరగాయలను వివిధ రాష్ట్రాల నుండి టీటీడీ అన్నప్రసాద వినియోగానికి వివిధ సందర్భాల్లో అందించిన కూరగాయల దాతలకు ఈవో ఎవి. ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు. రానున్న బ్రహ్మోత్సవాలకు సరఫరా చేయాల్సిన కూరగాయలపై చర్చించేందుకు టీటీడీ ప్రతి సంవత్సరం కూరగాయల దాతలతో ముందుగా సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.
దాతలను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, ప్రతిరోజూ తిరుమలకు వచ్చే భక్తులకు పౌష్టికాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు సేంద్రియ కూరగాయల విరాళాన్ని ప్రోత్సహించాలని కూరగాయల దాతలను కోరారు. గత మే నెల నుంచి ‘గో ఆధారిత వ్యవసాయం’ ద్వారా ఉత్పత్తి చేసిన తృణధాన్యాలతో శ్రీవారి అన్నప్రసాదాల తయారీని టీటీడీ ఇప్పటికే ప్రారంభించిందన్నారు.
“సాంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పండించడానికి టీటీడీ రైతులకు ఆవులు (పాలు ఇవ్వని) మరియు ఎద్దులను దానం చేస్తోందని చెప్పారు. టీటీడీ 2004లో ఒక దాతతో కూరగాయల విరాళాన్ని ప్రారంభించి, నేడు 17 మందికి పైగా దాతలు నిరంతరం కూరగాయలు అందిస్తున్నారన్నారు. మన సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
టీటీడీ ఎపి మార్క్ ఫెడ్ ద్వారా 12 రకాల సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని, ఇందులో 7000 టన్నుల బియ్యం, 2600 టన్నుల శెనగ పప్పు మరియు ఇతర తృణధాన్యాలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సేంద్రీయ రైతులకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం వస్తోందని, ఇది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అదేవిధంగా టీటీడీ సేంద్రీయ కూరగాయలను కూడా దశలవారీగా ప్రోత్సహించనున్నట్లు ” ఆయన చెప్పారు.
టిటిడి అన్నప్రసాదాలకు సేంద్రియ కూరగాయలు ఎలా పొందాలనే అంశంపై త్వరలో సేంద్రియ రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
అంతకుముందు అన్నప్రసాదం ఇన్చార్జి డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీఎల్ఎన్ శాస్త్రి ఈవోకు కూరగాయల విరాళాలను గురించి వివరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు దాతలు ఆకు కూరలు కూడా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈవో ఆదేశాల మేరకు ఈ ఏడాది అన్నప్రసాదం విభాగం మెనూ చార్ట్‌ను కూడా తయారుచేస్తోందని, ప్రతిరోజూ యాత్రికులకు వివిధ రకాల వంటకాలతో వడ్డిస్తున్నామని వారు తెలిపారు. అనంతరం కూరగాయల దాతలను ఈవో సన్మానించారు.
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి కూరగాయల దాతలు మరియు సేంద్రియ రైతులు, అన్నప్రసాదం ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.