ఏలూరులో పెను విపత్తు ఇవాళ మన ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. ఇంకా శాస్త్రబద్ధమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే విపక్షాలు మాత్రం దానిని క్యాష్ చేసుకునే తాపత్రయంతో ఉన్నాయి. మొదట డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని నీరు కలుషితం అయిందని విమర్శలు చేసిన వారు.. నీటిపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత.. నోర్లకు తాళాలు వేసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా.. వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం.. ‘ఆస్పత్రిలో రోగులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు జగన్ మాస్క్ ధరించలేదే’ అనే అంశం మీద అనేకానేక విమర్శలు గుప్పించాయి. జగన్ మాస్క్ ధరించలేదు అనే విషయాన్నే హైలైట్ చేస్తూ.. ఆయనను నిందించడానికి ప్రయత్నించాయి.

ఒక రకంగా చూస్తే ఇదంతా సంకుచితమైన నీచమైన ప్రచారం అని అర్థమవుతుంది. ఎందుకంటే.. సీఎం వైఎస్ జగన్ మాస్క్ ధరించే ఆస్పత్రికి వెళ్లారు. రోగుల్లో వృద్ధులు, అనేక మంది చిన్నారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. వారి బెడ్ మీదనే కూర్చుని ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టం విన్నారు. వారితో మాట్లాడే సమయంలో మాత్రమే.. జగన్ మాస్క్ తొలగించారు. అంతే తప్ప.. ఆస్పత్రి పర్యటనలో మాస్క్ వేసుకోలేదనడం కరెక్ట్ కాదు. స్వయంగా రోగుల వద్ద ఉన్నప్పుడు కూడా.. మొహానికి తీసిన మాస్క్ ను చేతిలో పట్టుకునే కనిపించారు. మళ్లీ పెట్టుకున్నారు. జగన్ వెంట ఉన్న వారందరూ కూడా మాస్క్ లు ధరించే ఉన్నారు. ఇలాంటప్పుడు.. అర్థంలేని విషయాన్ని పట్టుకుని, పనిగట్టుకుని దుష్ప్రచారం ఎందుకు చేశారో అర్థం కాని సంగతి.

ప్రధానంగా టీవీ ఛానెళ్లలో విజువల్స్ చూపించేప్పుడు.. కీలకవిజువల్స్ అంటే.. రోగులతో ఉన్నవి మాత్రమే కట్ చేసి చూపిస్తారు. అందులో మాస్క్ లేదు. ఇంతలోనే ప్రచారం ప్రారంభించారు.
ఏ చాన్సు దొరుకుతుందా.. జగన్ మీద బురద చల్లుదామా అని నిత్యం వేచి ఉండే దళాలు చేసే ప్రచారం ఇదీ అని జగన్ అభిమానులు మాత్రమే కాదు, తటస్థులు కూడా కొట్టి పారేస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉంటే వాటిని విమర్శించవచ్చు. ఆ లోపాల వల్ల సమాజానికి నష్టం జరుగుతోంటే.. పదేపదే వాటిని ప్రస్తావించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవచ్చు. కానీ బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా ఇలాంటి సంకుచిత ప్రచారాలకు దిగజారడం ఎలాంటి పరిణామం.?
Read this :
అమెరికా వీసాల కోసం ట్రైచేసి బుట్టలో పడ్డారు
బెజవాడ కనకదుర్గ చీరల పేరుతో మోసం
.