ఇద్దరు దంపతులు ఒక సైకాలజీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు డిప్రెషన్ సమస్యతో. డాక్టర్ వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత చివరగా ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు ఖచ్చితంగా, ధైర్యంగా చెప్పాలి అన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళను విడివిడిగా అడిగారు ఆ ప్రశ్నను.
మొదట భర్తను వేరే రూంలోకి తీసుకెళ్లి, తనకు బాగా ఇష్టమైన వాళ్ళ పేర్లు రాయమన్నాడు అక్కడున్న బోర్డు మీద.
అతను అక్కడున్న బోర్డు మీద ఒక పది పేర్లు రాసాడు.
దీంట్లో అంత ప్రాధాన్యతలేని ఐదు పేర్లు తుడిపేయమన్నాడు డాక్టర్. అప్పుడు అతను తన స్నేహితుల పేర్లలో ఐదు తుడిపేశాడు. తర్వాత రెండు పేర్లు తుడిపేయమన్నాడు డాక్టర్. అప్పుడు అతను రెండు పేర్లు తుడిపేశాడు. ఆ రెండు పేర్లు వాళ్ళ అమ్మా, నాన్నవి. ఇక మిగిలింది ముగ్గురు. తన భార్య, ఇద్దరు పిల్లలు. చివరిగా ఇందులో ఎన్ని పేర్లు తుడిపేయగలవో తుడిపేయమన్నాడు. అప్పుడు అతను తన భార్య పేరును తుడపలేక తుడిపేశాడు.
చివరికి భార్య పేరు కూడా తుడిపేసి పిల్లల పేర్లే ఎందుకు ఉంచావు అడిగాడు డాక్టర్.
స్నేహితులుగాని, తల్లితండ్రులుగాని చివరివరకు మనతో ఉండరు. చివరివరకు నాతో తోడుగా ఉండేది భార్యా పిల్లలే. కానీ నా సమస్య భార్యనే అయితే ఎవరికి చెప్పుకోవాలి. అందుకే ఆమె పేరు తుడిపేసాను. పిల్లలను ఏటూ వదిలేయలేము కాబట్టి అని చెప్పాడు.
భార్యను కూడా అదేవిధంగా వేరే గదిలో ప్రశ్నిస్తే ఆశ్చర్యంగా ఆమె కూడా చివరిగా తన భర్త పేరు తుడిపేసి తన పిల్లల పేర్లే ఉంచింది. ఎందుకని అడగగా ఆమె కూడా భర్త చెప్పిన సమాధానమే చెప్పింది. తన సమస్య భర్తేనని.
తర్వాత డాక్టర్ ఇద్దరికీ అసలు విషయం చెప్పి కౌన్సిలింగ్ ఇలా ఇచ్చాడు-
1. మీ ఇద్దరూ ఏదొక విషయాన్ని దాస్తున్నారు, ఒకరికి తెలియకుండా మరొకరు. అందువల్ల మీరు ఒకరిపై మరొకరు నమ్మకాన్ని కోల్పోయారు.
2. ఎప్పుడైతే నమ్మకం కోల్పోతారో క్రమేపి ఒకరిపై మరొకరికి ఇష్టం తగ్గిపోతుంది.
3. ఎప్పుడైతే ఇష్టం తగ్గిపోతుందో ఇద్దరిలో ఎవరు ఏం చెప్పినా, చేసినా ఇద్దరికీ నచ్చదు. చివరికి ఆ సమస్య విడాకులు వరకు వెళ్ళవచ్చు.
4. కాబట్టి ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా చూసుకోండి.
5. ఒకరిపై మరొకరు ప్రేమగా ఉండండి.
6. కలిసి భోజనం చేయండి. పిల్లలతో కలిసి సరదాగా సినిమాలకు, విహారయాత్రలకు వెళ్ళండి.
అప్పుడు మీ మధ్య సత్సంబంధాలు ఏర్పడుతాయి. అంతేకాదు పిల్లల మనోవికాసం కూడా అభివృద్ధి చెందుతుంది. అని చెప్పాడు డాక్టర్.
కొసమెరుపు:
డాక్టర్ దగ్గరకు వచ్చే వారిలో నూటికి తొంభైశాతం మంది ఇదే సమస్యతో బాధపడుతుండడం గమనార్హం.
..దేవీ ప్రసాద్ ఒబ్బు
Discussion about this post