చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్ల సేవ చేయడానికి రజకులకు అవకాశం కల్పించాలని రజక సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు వారు గురువారం ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాల్లో ఉత్సవాల సమయంలో రజక కులస్థులు దివిటీ పట్టడం.. స్వామి, అమ్మవార్ల బట్టలు ఉతకడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కూడా గత కొంతకాల కిందట వరకు రజకులు బట్టలు ఉతికి ఇచ్చేవారన్నారు.
కానీ ప్రస్తుతం యంత్రాల సాయంతో బట్టలు ఉతుకుతున్నారన్నారు. ఇలా చేయడం వలన దేవస్థానంలో బట్టలు ఉతికి జీవనం గడిపే రజక కులస్తులు తమ వృత్తిని పూర్తిగా వదులుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల తీరుతో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.. కులవృత్తి అంతరించి పోతోందన్నారు.
కులవృత్తులను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాలకు దేవదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు స్వస్తిచెప్పి… దేవస్థానంలో రజక కులస్తుల చేసుకునే వృత్తిని కొనసాగించాలని డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో రమేష్, సంజాకుల మురళి, అయోధ్య పేట బాబు, హరి, భాస్కర్, బాబు, వీరాస్వామి, సురేష్, మహేష్, శంకర తదితరులు పాల్గొన్నారు.
.