మనం బరువు తగ్గాలని చాలా బలంగా అనుకుంటాం. ఆ దిశగా బోలెడు ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వారు కూడా మనకు తారసపడుతుంటారు. అయితే చక్కగా తింటూనే మనం బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా చేసే పని ఉదయం అల్పాహారం మానేయడం. అయితే ఇది అంత మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం చక్కగా ఎక్కువ ప్రోటీన్లు కలిగివున్న అల్పాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మామూలు ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజనంలోగా మళ్లీ మనకు ఆకలివేసి, ఏదైనా తినాలనిపిస్తుంది. అలాకాకుండా మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మధ్యలో ఏదైనా చిరుతిండ్లు తినాలనే ఆలోచనను మననుండి దూరం చేస్తుందట.
మన శరీరంలో ఆకలిని పెంచడంలో గ్రెలిన్ అనే హార్మోను పనిచేస్తుంది. ఈ హార్మోన్ మనం ఉదయం అధిక ప్రోటీన్ కలిగివున్న ఆహారం తీసుకోవడం వల్ల దీని ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా మనకు తక్కువ ఆకలి వేస్తుంది. మధ్యాహ్న భోజనాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటాం. దీంతో బరువు తగ్గడం కూడా మనకు సులభమవుతుందట.
ఇంకేం… బరువు తగ్గాలి అనుకునేవారు చక్కగా టిఫిన్ అందునా… ఎక్కువ ప్రోటీన్లు ఉన్న టిఫిన్ కడుపునిండా లాగించేయండి మరి. జాగ్రత్త అందులో నూనె పదార్ధం తక్కువగా ఉండేలా చూసుకోండి. అసలు నూనే లేదంటే మరీ మంచిదే… లేదంటే మీ లక్ష్యం రివర్స్ గేర్ లో వెళ్లే ప్రమాదం ఉంది.
.