శ్రీకాళహస్తి పట్టణ శివారులో గల రాజీవ్ నగర్ లో ఆక్రమణలపై రెవిన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజీవ్ నగర్ లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయి.
కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి… ఇతరులకు విక్రయిస్తున్నారు. రెవిన్యూ అధికారులు అడ్డుకోవడానికి యత్నిస్తే.. రాజకీయ పార్టీల నేతల నుంచి ఫోన్లు చేయిస్తారు. దీంతో రెవిన్యూ అధికారులు ఏమీ చేయలేక వెనుదిరిగి రావాల్సి వచ్చేది.
ఇదే అదనుగా ఆక్రమణ దారులు రెచ్చి పోతూ వచ్చారు. రాజకీయ పార్టీల పెద్దల పేరు చెప్పి మరీ ఆక్రమిస్తూ వచ్చారు. ఈ అక్రమణలపై శ్రీకాళహస్తి తహసీల్దారు జరీనా బేగంతో పాటు.. కలెక్టరు హరినారాయణన్ కు ఫిర్యాదులు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో రాజీవ్ నగర్ లో ఆక్రమణలు తొలగించాలని వారు రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి రెవిన్యూ ఇన్స్ పెక్టరు అనిల్, వీఆర్వో బాలమురళి మరికొంత మంది కలసి రాజీవ్ నగర్ లో పిచ్చాటూరు రోడ్డుకు తూర్పు వైపున అక్రమంగా వేసిన 47 పునాదులను తొలగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఎవరైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే స్థానికులు తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
.