1507 వ సంవత్సరం, మే నెల, 21వ తేదీ!
సమయం- మధ్యాహ్నం సుమారు రెండు గంటలు దాటింది!
ఎండ మండుతోంది!లోకాన్ని మండిస్తోంది!!
ప్రదేశం- హిందూ మహాసముద్రంలోని మారిషస్ దీవులలో సముద్రాన్ని ఆనుకొని ఉన్న నిర్జనమైన అరణ్య ప్రాంతం!
సరిగ్గా ఆ సమయంలో ‘ధన్ ‘మనే తుపాకీ మోతతో ఆ అరణ్య ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది!
మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో కాలుమోపిన ఆనందంలో నలుగురు పోర్చుగీసు నావికులు ; సముద్రపు ఒడ్డుకు తమ పడవను చేరుస్తూ, పేల్చిన నాటు తుపాకీ మోత అది!!
ఆ భయంకర శబ్దానికి తల్లడిల్లి పోయిన జంతువులన్నీ దూరంగా ఎటో పరుగులు తీశాయి. దగ్గరలోని తుప్పలను, చెట్లను ఆశ్రయించుకొని ఉన్న పక్షులు; రెక్కలు తపతపలాడించుకుంటూ రివ్వున ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. ఆ హడావిడి కి అరణ్యమంతా వణికినట్లు అయింది! నావికులు నలుగురూ తమ పడవను తాడుతో దగ్గరలోని చెట్టుకు కట్టి,కబుర్లు చెప్పుకుంటూ అరణ్యం వైపుకు కదిలిపోయారు.
ఒక నావికుడు ఆనందం పట్టలేక మరోసారి గాలిలోకి నాటు తుపాకీ పేల్చాడు! మళ్ళీ ప్రకృతి కంపించి పోయినట్లు అలజడి! పక్షి కోటిలో మళ్ళీ కలకలం ! ప్రకృతిలోని పక్షులు, జంతువులు తమకు తలవంచి పారిపోతూ ఉంటే, ఈ వ్యవహారంతో తనకి ఏమీ సంబంధం లేనట్లు ,ఎదురుగా పదిహేను అడుగుల దూరంలో నిలబడి వున్న పెద్ద కోడి లాంటి పక్షి ఆకారాన్ని చూడగానే, నావికులు నలుగురికీ ఒళ్ళు మండిపోయింది!!
‘ఎంత పొగరు దీనికి?’ అనుకున్నారు. ఒక నావికుడు దాని వంకే తుపాకీ గురిపెట్టి, “ఉష్..ఉష్..డిర్…డిర్…”అని అరుస్తూ దానిని అదిలించాడు. కనుగుడ్లు ఇటు అటు కదిలిస్తూ, అమాయకంగా ఆ నావికుల వంకే చూస్తూ నిలబడిపోయింది తప్ప , కనీసం ఎగిరే ప్రయత్నం కూడా చేయలేదు ఆ పక్షి! అదిలించిన నావికునికి ఒంటిమీద కారం రాసినట్లయింది! అంతే !! దానికి గురిపెట్టి తుపాకీ పేల్చాడు. ‘కువ్…’అని రోదిస్తూ, రెక్కలు తప తప కొట్టుకొని ,కళ్ళు మూసింది ఆ మూగ జీవి!…. ఆ పక్షి పేరు డోడో!!
ఆ రాత్రికి ఆ పక్షి మాంసంతో విందు ఆరగించారు నావికులు. అంత రుచికరమైన మాంసం వారెప్పుడు తిని ఉండలేదు. సుమారు పదిహేను పౌనుల రుచికరమైన మాంసం అందించే ఈ రకమైన పక్షి మళ్లీ కనిపిస్తే వదలకూడదని నిశ్చయించుకున్నారు.
కొత్త ప్రదేశాలను కనిపెట్టాలనే ఆసక్తితో ప్రపంచ యాత్రకు బయలుదేరిన ఆ నావికులు మారిషస్ ద్వీపంపై కాలుమోపి , అక్కడ మాత్రమే అరుదుగా కనిపించే డోడోలను వేటాడటం ప్రారంభించారు. అలా 1507వ సంవత్సరంలో ప్రారంభమైన డోడో పక్షుల మారణకాండ, 175 సంవత్సరాలు పాటు అవిచ్ఛిన్నంగా సాగిపోయింది .1681 వ సంవత్సరం తర్వాత ఆ అమాయక పక్షులను చూసిన వారు ఎవ్వరూ లేరు! అప్పటితో ఆ జాతి భూమి మీద నుండి పూర్తిగా విడిచిపెట్టుకుపోయింది !!అత్యంత అరుదైన ఒక ప్రాణికోటి , మనిషి తన స్వార్థం కోసం సాగించిన మారణకాండకు అంతరించిపోయింది!!
అయితే డోడోలు అంతరించిపోవడం వలన మానవజాతికి జరిగిన నష్టం ఆ తర్వాత శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడయింది .1973 వ సంవత్సరంలో మారిషస్ ద్వీపంలోని లోని వాతావరణ స్థితి, జీవరాసుల మనుగడ మొదలైన విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేయటానికి, అమెరికా విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి ఒక శాస్త్రజ్ఞుల బృందం బయలుదేరి ఆచటకు వెళ్ళింది .
ఆ బృందానికి నాయకుడు ప్రొఫెసర్’ టెంపుల్ ఎ స్టాన్లీ’ .
వారు సుమారు సంవత్సరం కాలం పాటు సాగించిన పరిశోధనలో ఒక విచిత్రమైన విషయం వెల్లడయింది ! మొత్తం ప్రపంచం అంతటికీ కేవలం మారిషస్ దీవులలో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష సంతతికి చెందిన ‘కేల్వేరియా మేజర్’ అనబడే వృక్షాలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయని తెలిసింది. మన దేశంలోని మర్రి చెట్ల కంటే చాలా పెద్దవైన ఈ వృక్షాలు కేవలం 13 మాత్రమే మిగిలి ఉన్నట్లుగా ఆ బృందం కనుగొంది ! అంతకుముందు వేలాది చెట్లతో ఆ దీవుల నిండా నిండిపోయి ఉండి, సతతం చల్లదాన్నిచ్చే ఆ వృక్షజాతి ,ఎందుకు అంతరించిపోయిందో చాలా రోజుల వరకు వారికి అంతుబట్టలేదు! మిగిలి ఉన్న పదమూడు వృక్షాల వయసు కూడా సుమారు 300 ఏళ్లకు దగ్గర పడ్డవే అని తేల్చారు శాస్త్రజ్ఞులు!
అంటే , సుమారు ఈ మూడు వందల సంవత్సరాల కాలంలో కెల్విరియా మేజర్ కొత్త మొక్కలు ఏవి మొలకెత్తలేదు అన్న మాట!! ఎందుకు మొలకత్తలేదు?! శాస్త్రజ్ఞుల బుర్రలను దొలిచే ఈ ప్రశ్నకు సమాధానం వారి పరిశోధనలలో తెలిసింది. అసలు విషయం ఆవిష్కరణ అయింది!
‘కెల్ వేరియా మేజర్’ చెట్టుకు మన మర్రిచెట్టుకు మల్లేనే పళ్ళు ఉంటాయి. పళ్ళ లోపల గట్టి గింజలు ఉంటాయి. ఈ గింజ లోపల వృక్షం మొలకెత్తడానికి పనికి వచ్చే విత్తన భాగం ఉంటుంది. అయితే విత్తనం చుట్టూ ఉండే గింజ కవచం చాలా గట్టిగా ఉండటం వలన మామూలుగా నేల మీద పడితే మొలకలు రావు. డోడోపక్షులకు ఈ పండ్లు అత్యంత ప్రీతికరమైనవి. ఆ పళ్ళను తినేసి లోపల గింజలను రెట్టల ద్వారా విసర్జించేవి .ఆ రెట్టలో నానిపోయిన పెంకును చీల్చుకొని విత్తనం మొలకెత్తేది. ఈ విధంగా కెల్వేరియా వృక్షాలు మొలకెత్తటానికి ఈ పక్షుల ద్వారా ప్రకృతి పరమైన సహాయం అందేది. అయితే డోడోలు అంతరించిపోవటంతో ఆ వృక్షాల విస్తరణకు అడ్డుకట్ట పడింది!
దోడోలు అంతరించిపోయాక, కేల్వేరియా మేజర్ మరి మొలకత్తలేదు!! ఎంత ఘోరమైన నష్టం!! చావటానికి సిద్ధమైపోతున్న అత్యంత అరుదైన కెల్వేరియా వృక్షాల వంక చూస్తూ, మనసు స్పందిస్తే కంటతడి పెట్టడం తప్ప, మరేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది మన మానవ సమాజం!! ఎంత దయనీయమైన పరిస్థితి?! అయితే ఈ ఘోర వినాశనానికి కారణం, పర్యావరణ పరిరక్షణ యెడల మనిషి చూపిస్తున్న నిర్లక్ష్యం! ప్రకృతిని అవిచ్ఛిన్నంగా దోచుకుంటున్న మనిషి స్వార్థం!!
(మార్చ్ మూడో తేదీ ‘ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం’ సందర్భంగా రాసిన వ్యాసం)
Discussion about this post