తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి అందరినీ విస్మయపరిచారు. అయితే ఇక 14 మాత్రం ఇంకా పెండింగులో ఉన్నాయి. అందులో తమ సిటింగుల్లో టికెట్ నిరాకరించిన అయిదుగురితో పాటు, భాజపా, కాంగ్రెస్ లను దెబ్బకొట్టడానికి గట్టి అభ్యర్థులను ఎంచడం కోసం కేటాయించిన కొన్ని స్థానాలున్నాయి. ఇవి కాగా, మజ్లిస్ కు చెందిన కొన్ని సీట్లు కూడా ఉన్నాయి.
తమాషా ఏంటంటే.. అన్నిచోట్లా ఖచ్చితంగా గెలిచే వారి కోసం వేట సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ మజ్లిస్ సీట్లలో మాత్రం ఓడిపోయే వారి కోసం వేటాడుతున్నారని తెలుస్తోంది. మజ్లిస్ మీద గెలిచే అవకాశం లేకుండా, ఓడిపోగల సత్తా ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నారట.
తెరాస, మజ్లిస్ లమధ్య పొత్తు లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మజ్లిస్ తమకు మిత్రపక్షమే అని వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కలసి పోటీచేయరు. ఒకరికి మరొకరు సహకరించుకుంటారు. అంతే. తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ మరోసారి సీఎం కాబోయేది కేసీఆర్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ఈ భాగ్యానికి ఆ రెండు పార్టీలు అసలు పోటీచేయడం ఎందుకు? అనే మాట ప్రజల్లోంచి వినిపిస్తోంది.
ఇంతకూ కేసీఆర్ ఆ మజ్లిస్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పోటీ కి దించుతారా లేదా అనేది కూడా సందేహాస్పదంగా మారింది. పైకి పోటీ అంటూ.. లోలోపల సహకరించుకుంటూ ప్రజల్ని వంచించే బదులుగా ఎంచక్కా.. మజ్లిస్ స్థానాల్లో తెరాస అసలు అభ్యర్థులనే పోటీకి దించకుండా ఉంటే సరిపోతుంది కదా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
.
Discussion about this post