Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
ఘంటసాల చెప్పుకున్న సొంత కథ- 3
సంగీత విద్యలో పట్టభద్రుడనయిన తరువాత స్వగ్రామం చేరుకొని ఆంధ్ర దేశంలో పలుతావుల్లో శ్రీరామనవమి, శారదా నవరాత్రులు, గణపతి నవరాత్రులు మొదలగు ఉత్సవ కార్యక్రమాలలో, వివాహ మహోత్సవాల్లోనూ సంగీత కచ్చేరీలు అనేకం చేసేను.
ఆ రోజుల్లోనే పూజ్యులు వాగ్గేయకారులయిన శ్రీహరి నాగభూషనంగారు, శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు, శ్రీ క్రోవి సత్యనారాయణగారు, శ్రీ వారణాసి బ్రహ్మయ్యశాస్త్రిగారు మొదలగు సుప్రసిద్ధ విద్వాంసుల ఆశీర్వాదాలు పొందడం జరిగింది. తరువాత కొంతకాలానికి మద్రాసు చేరిన తరువాత కూడా ఆల్ ఇండియా రేడియోలో నేను చాలాకాలం శాస్త్రీయ సంగీత కార్యక్రమాలే యిచ్చేవాణ్ని.
అయితే కేవలం సంగీత కచేరీలపైననే ఆర్ధికంగా ఆధారపడి జీవితం గడపడం దుర్భరమనిపించింది. ఆంధ్రదేశంలో సంగీత కచేరీలకన్న నాటక ప్రదర్శనలూ హరికథలే ఆర్ధికంగా లాభదాయకంగా కనపడింది. బాల్యం నుంచి నృత్యంలోనూ, నాటక కళలోనూ అభిరుచి ఉండటంచేత స్వయంగా ఒక నాటక సమాజాన్ని స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించేను.
also read : ఒక్క యాడ్ తో తన పరువు తానే తీసుకున్న ఈనాడు
అప్పట్లోనే సుప్రసిద్ధ స్టేజి నటకులు శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి, శ్రీ పారుపల్లి సుబ్బారావు, శ్రీ పారుపల్లి సత్యనారాయణ, శ్రీ సూరిబాబు, శ్రీ రఘురామయ్య, శ్రీ పులిపాటి వేంకటేశ్వర్లు, శ్రీ పీపసాటి నరసింహమూర్తి మొదలగు పెద్దలతో పరిచయం అయి, తరువాత వీరిలో కొంతమందితో కలిసి నాటకాలలో నటించే అవకాశం కూడా కలిగింది. అప్పట్లో ఒకమారు ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కూడా పాల్గొనడం జరిగింది. అయితే నాడు నాకు యేవిధమైన గుర్తింపు కూడా జరగలేదు. మరో పుష్కరం దాటేక ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు నన్ను సన్మానించడం జరిగింది.
సంగీత సభలు చేస్తూ, నాటకాలు ఆడుతూ సంగీత శిక్షణలు యిస్తూ ఆర్ధికంగా సతమతమవుతున్న సమయంలోనే ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో మునిగింది. భారతదేశం పర ప్రభుత్వానికి దాస్యం చేస్తూ ఉంది. మన నాయకులు అందరు జైళ్లలో మ్రగ్గుతూ ఉన్నారు. జాతీయ కాంగ్రెసు ‘క్విట్ ఇండియా’ తీర్మానం చేసింది. రాజకీయంగా దేశమంతటా ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. 1942లో ఆగస్టులో దేశం నలుమూలలా కార్చిచ్చువలె విప్లవోద్యమం చెలరేగింది.
నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబ బాధ్యత నా సంగీత సాధన అన్నీ దేశ భవితవ్యం దృష్ట్యా చాలా అల్పంగా కనిపించేయి. నేను ఏనాడూ యేవిధమైన ఉద్యమాల్లోనూ అంతవరకూ పాల్గొన్నవాణ్ని కాదు. ఏవిధమైన రాజకీయ విధానాలూ తెలిసిన వాణ్నీ కాదు. అయితే ఒకటే అమాయకమైన ఆవేశం కలిగింది. దేశం యువకుల ధైర్యసాహసాలను, త్యాగాన్ని కోరుతూ ఉంది. ప్రతి యువకుడూ అర్థం, మానం, ప్రాణం ఆహుతి చేయవలసిన సమయం వచ్చింది. ఏమైనా కాని ఇంతకంటే భారత పౌరుడుగా వేరే కర్తవ్యం నాకు లేదు. ఈ ఆవేశంతోనే చాలామంది మిత్రులతో నాటి ఆగస్టు ఉద్యమంలో పాల్గొన్నాను. ఫలితంగా నాటి పరప్రభుత్వం పదునెనిమిది మాసాలు కారాగార శిక్ష విధించింది.
జైలు జీవితం నాకు ఎన్నో విధాలుగా మహోపకారం చేసింది. కర్తవ్య దీక్ష, స్థిర సంకల్పం, నియమబద్ధ జీవితం, నేను జైలు జీవితం గడిపినప్పుడే అర్ధం చేసుకున్నాను. జైలులో ఉన్నప్పుడే శ్రీ గోపాలరెడ్డిగారు, శ్రీ పొట్టి శ్రీరాములుగారు, శ్రీ బి.యస్.మూర్తిగారు, శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు మొదలగు నాయకుల సాహచర్యం లభించింది.
జైలునుండి విడుదల పొందిన తరువాత నాలో ఏ విధమైన రాజకీయాల ప్రభావం మిగలలేదు. మళ్ా నా సహజ మనఃస్థితిలో పడి, నా సంగీత సాధనలోనూ, నాటక ప్రదర్శనలలోనూ రోజులు గడపడం ప్రారంభించేను.
ఈరోజులలోనే నేను వివాహం చేసుకొనడం జరిగింది. నా శ్రీమతి సాహచర్యం నా ఆశల, ఆదర్శాల సాఫల్యానికి నాందీ వాక్యం పలికింది.
ఘంటసాల చెప్పుకున్న సొంత కథ- 4వ భాగం : సినీ పరిశ్రమలోకి ఎలా?

.