చక్కటి కుటుంబం.. చక్కటి జీవితానికి పునాది, వెన్నెముక కూడా. ‘అనుకూల దాంపత్యం.. అనాయాస మరణం..’ అద్భుతమైన వరాలు అని పెద్దలు ఊరికే అనలేదు. కుటుంబంలో సఖ్యత, సౌఖ్యం ఉంటే.. అంతకు మించిన వరం ఇంకొకటి ఉండదు. సౌహార్దపూరిత వాతావరణం ఇంట్లోను, మిత్రబృందంలోను ఉండడం వ్యక్తిగత విజయమే.
అనుకూల దాంపత్యం లాగానే, అనుకూలమైన, హితకరమైన ఆప్త బృందం కూడా ఉండాలి. కుటుంబం అంటేనే మనకు అత్యంత సన్నిహితమైన యూనిట్ గా పరిగణిస్తాం. మరి అలాంటి సాన్నిహిత్యంతో.. మనలో మమేకమైన కలిసిపోయిన తీరులో కొన్ని మంచి లక్షణాలే ఉంటే గనుక.. ఆ జీవితం ఇంకెంత బాగుంటుంది? కుటుంబం అనదగినంత సన్నిహిత పరిధిలో ఎలాంటి మంచి లక్షణాలను పొదవుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది.
ఇదే విషయాన్ని ఓ సుభాషితం కూడా చెబుతుంది.
ధైర్యం యస్య పితా క్షమా జననీ శాంతిః చిరం గేహినీ
సత్యం మిత్రం ఇదం దయా చ భగినీ భ్రాతా మనః సంయమః
శయ్యా భూమి తలం దిశో అపి వసనం జ్ఞానామృతం భోజనం
ఏతే యస్య కుటుంబినః వద సఖే కస్మాద్ భయం యోగినః
ఏ వ్యక్తికైతే ధైర్యమే తండ్రిగా, క్షమ తల్లిగా, ప్రశాంతచిత్తం అనేది భార్యగా, సత్యం మిత్రుడిగా, దయ సోదరిగా, మనోనియంత్రణ సోదరుడిగా కలిగి ఉంటాడో…
ఏ వ్యక్తి అయితే.. నేల పరుపుగా, దిక్కులే వస్త్రాలుగా, జ్ఞానమే భోజనంగా అనుభవిస్తూ ఉంటాడో.. అంతటి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతుంటాడో..
ఇలాంటి కుటుంబాన్ని, ఆప్తులను కలిగిఉన్న వ్యక్తికి ఇక ఏ విషయంలోనైనా భయం ఎందుకుంటుంది?
.. అనేది శ్లోక భావం.
ధైర్యం, క్షమ, ప్రశాంతత, సత్యం, దయ, మనస్సుపై నిగ్రహం ఈ లక్షణాలన్నీ కుటుంబసభ్యుల్లాగా మనతో నిత్యం కలిసి ఉండాలని చెబుతుంది ఈ సుభాషితం. అలాగే.. కటికనేల మీదనే పడుకోగల, దిక్కులే వస్త్రాలుగా భావించగల నిరాడంబరత కూడా ఉండాలంటుంది. ఈ సుభాషితం చెప్పే విలువైన విషయమెల్లా.. జ్ఞానామృత భోజనం.
ఈ మంచి లక్షణాలన్నీ కలిగి ఉంటూ.. ఇంత నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ.. మరోవైపు భోజనంగా జ్ఞానాన్నే స్వీకరిస్తూ ఉండాలని ఈ సుభాషితం చెబుతుంది.
ఆచరణలో ఇదంతా సాధ్యమైతే గనుక.. అంతకంటె మెరుగైన జీవితం ఏం ఉంటుంది?
ఏతావతా మంచి లక్షణాలను సొంత కుటుంబ సభ్యుల్లాగా నిత్యం మన జీవితంలో మమేకం చేసుకుని ఉండాలని ఈ సుభాషితం చెబుతుంది.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post