అడుగు ముందుకు వేయాలంటే అనేక అంశాలను మనం పరిశీలించుకోవాలి. ఒక కార్యం సాధించడానికి ప్రయత్నం మొదలు పెడుతున్నాం అంటే.. కార్యసాఫల్యం దక్కడానికి అనేక విషయాలను బేరీజు వేసుకోవాలి. సహజంగా మన శక్తి సామర్థ్యాలు అందుకు తగినట్లుగా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకుంటాం. కానీ ఇంకా చాలా విషయాలు పరిశీలించుకోవాలి.
చాణక్యుడు చెప్పే మేనేజిమెంట్ సూత్రాలకు చాలా విలువ ఉంది. చాణక్యుడి సూత్రాల మీద చాలానే పుస్తకాలు కూడా వచ్చాయి. అదే చాణక్యుడు.. ఒక కార్యం తలపెట్టినప్పుడు మనం పదేపదే స్మరించుకోవాల్సిన, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశాలను కొన్నింటిని వర్గీకరించాడు.
చాణక్యుడు నిర్దేశించిన ఈ ఆరు ప్రశ్నలను మనకు తెలియజెప్పే సుభాషితం ఇది.
కః కాలః కాని మిత్రాణి కో దేశః కో వ్యయాగమౌ
కస్యాహం కా చ మే శక్తిరితి చిన్త్యం ముహుర్ముహుః
నా చుట్టూతా పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయా లేదా? నా మిత్రులు (మేలుకోరేవారు) ఎవరు? దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాకు వచ్చేవి ఏమిటి? పోయేవి ఏమిటి? నేను ఎవరు? నా శక్తి సామర్థ్యాలు ఏమిటి? .. ప్రతిఒక్కరూ కూడా ఈ ప్రశ్నల గురించి పదేపదే ఆలోచిస్తూ ఉండాలి. – అనేది శ్లోకభావం.
పని అనుకున్న తరువాత.. పరిస్థితుల్ని అంచనా వేసుకోవడం అందరూ చేసేదే. శక్తి సామర్థ్యాలను చాలా మంది అతిగా ఊహించుకుంటారు. కానీ వాటి గురించి తప్పకుండా ఆలోచిస్తారు. కానీ చాణక్యుడు చాలా స్పష్టంగా ఆరు ప్రశ్నలు విధిగా ఉండాలంటున్నాడు. వీటిని విడివిడిగా చూద్దాం.
కః కాలః చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి. రైతు విత్తనం వేయాలన్నా సరే అదను చూసి మాత్రమే వేస్తాడు. అకాలంలో విత్తిన పంట దండగే అవుతుంది. ఏ అదునులో విత్తితే ఫలితం ఎలా ఉంటుందో రైతుకు ఒక అవగాహన ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా అదే పాటించాలి. స్వెటర్లు అమ్మే వ్యాపారం చేయదలచుకున్నప్పుడు.. దానిని వేసవిలో ప్రారంభిస్తే పురిటిలోనే సంధి కొడుతుంది. దొంగతనం చేయాలనుకున్నప్పుడు పట్టపగలు ఎవరూ బయల్దేరరు. అలాగే సమయం ఎలా ఉంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనేవి నిత్యం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి.
కాని మిత్రాణి మన స్నేహితులు ఎవరు? అనే అంచనా నిత్యం మనలో ఉండాలి. ఫోను కాంటాక్టులలో వందల మంది ఉండొచ్చు. చాణక్యుడు చెబుతున్న స్నేహితులు వారందరూ కాదు. నువ్వు కార్యం తలపెట్టిన తర్వాత.. కార్యసాధనకు ఉపక్రమించిన తర్వాత నీకు తోడ్పాటు అందించగలవారు ఎవరు? నీకు సహకరించగలవారు ఎవరు అనేది.. ఇక్కడ మిత్రులనే పదానికి నిర్వచనం. ఎదురు దెబ్బ తగిలితే నీకు అండగా నిలబడేదెవరు? అనేది కూడా ప్రశ్న.
కో దేశః దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్న కూడా వేసుకోవాల్సిందేనట. చాణక్యుడు మనకు పురాణాలు చెప్పలేదు. మంచి చెడులు మాత్రమే చెప్పి వదిలేయలేదు. ప్రాక్టికల్ గా వివరించాడు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనేది కూడా బేరీజు వేసుకుని మనం పని ప్రారంభించాలి. దేశం పూర్తిగా ఎండలు మాత్రమే ఉండే దేశం అయితే మన స్వెటర్ల వ్యాపారం దండగ. అలాగే దేశం అంటే రాజ్యం (ప్రభుత్వం) అనే అర్థం తీసుకుంటే గనుక.. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది గమనిస్తూ ఉండడం కూడా కార్యసాధకునికి అవసరం. దేశంలోని అధికారిక విధానాలు పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా చేసుకుంటూ పోతే.. వైఫల్యమే ఎదురవుతుంది.
కో వ్యయాగమౌ వచ్చేది పోయేది ఏంటి? అనేది లెక్క తేలాలి. ఒక పని చేయదలచుకున్నాం.. దాని వల్ల ఏం ఒరుగుతుందో తెలియాలి? ఏం లాభం ఉంటుందో అంచనా ఉండాలి. అలాగే.. దానికోసం ఏం కోల్పోతున్నామో కూడా అంచనా ఉండాలి. నామమాత్రపు ప్రయోజనానికి.. రోజులు నెలల తరబడి సమయం వెచ్చించవలసి వస్తే అది మూర్ఖత్వం అవుతుంది. అందుకే వచ్చేదెంత? పోయేదెంత? అనే క్లారిటీ ముందే ప్రశ్నించుకుని ఉండాలంటాడు చాణక్యుడు
కస్యాహం నేను ఎవరు? అనే ప్రశ్న ఆధ్యాత్మిక పరమైనదేమీ కాదు. కానీ కార్యసాధకుడికి అవసరమైన ప్రశ్న ఇది. కుండలు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్నవాడు.. స్వెటర్లు అమ్మే వ్యాపారం చేయాలనుకుంటే ఎలా ఉంటుంది. అది ఖచ్చితంగా దెబ్బతింటుంది. అందుకే నేను ఎవరు? అనే ప్రశ్న అవసరం. మన గురించి మనకు స్పష్టత ఉంటే.. తదనుగుణమైన వ్యాపారాలే పనులు చేయడానికి పూనుకుంటాం.
కా చ మే శక్తిరితి నా శక్తి సామర్థ్యాలు ఏమిటి? అనే ష్రశ్న ఉండాలి. శక్తికి మించిన పనలకు సాహసించవచ్చు గానీ.. అది అతి కాకూడదు. మన బలం గురించి అంచనా కూడా లేకుండా.. కార్యసాధనకు పూనుకుంటే దెబ్బ తగులుతుంది.
ఈ ఆరు ప్రశ్నలు ప్రతి వ్యక్తీ తమకు తాము వేసుకోవడం మాత్రమే కాదు. చాణక్యుడు వాటిని అమర్చిన క్రమం కూడా చూడండి. అది కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కలిసే ఎవ్వరైనా సరే సాధించగల విజయాన్ని నిర్దేశిస్తాయి.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post